క్రిప్టో యాప్‌ పేరుతో ఘరానా మోసం ! | - | Sakshi
Sakshi News home page

క్రిప్టో యాప్‌ పేరుతో ఘరానా మోసం !

May 8 2026 9:50 AM | Updated on May 8 2026 9:50 AM

మా దృష్టికి రాలేదు

త్రిపురారం : కష్టపడకుండానే కాసులు కురుస్తాయని ఆశపడ్డారు.. ఆన్‌లైన్‌ యాప్‌లో అధిక లాభాలు ఆర్జించవచ్చు అని మోసగాళ్లు చెప్పిన మాయమాటలు నమ్మారు. చివరకు కష్టపడి కూడబెట్టిన సొమ్మును కేటుగాళ్ల పాలుచేసి లబోదిబోమంటున్నారు. క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో సాగుతున్న ఓ భారీ స్కామ్‌ ఇప్పుడు నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో కలకలం రేపుతోంది. డబుల్‌ ధమాకా ఆఫర్లతో సామాన్యులను ఆకర్షించి, వారి నుంచి లక్షలాది రూపాయలు కొల్లగొట్టినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రిప్టో యాప్‌ మోసం వెనుక త్రిపురారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

30 రోజుల్లో డబ్బు రెట్టింపు

ఈ దందాలో నిందితులు అనుసరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది. ముందుగా రూ.50 వేలు పెట్టుబడిగా పెట్టించి ఒక ఐడీ కేటాయిస్తారు. అనంతరం వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో చేర్చి, ప్రతిరోజూ ఒక గజిబిజి కోడ్‌ను పంపిస్తారు. ఆ కోడ్‌ను యాప్‌లో వారు పంపిన లింక్‌ ఓపెన్‌ చేసి పేస్ట్‌ చేస్తే చాలు..డాలర్లు వచ్చినట్లు కనబడతాయి. చైన్‌ సిస్టమ్‌ తరహాలో మరికొందరిని చేర్పిస్తే అదనపు కమీషన్లంటూ ఆశ చూపారు. దీంతో మధ్యతరగతి ప్రజలు, రైతులు, చిరు వ్యాపారులు సైతం తమ వద్ద ఉన్న సొమ్మును ఈ యాప్‌లో కుమ్మరించి మోసపోయారు. 30 రోజుల్లో డబ్బులు రెట్టింపు అంటూ పలువురితో ఈ యాప్‌ ద్వారా పెట్టుబడులు పెట్టించినట్లు తెలిసింది. క్రిప్టో యాప్‌ పెట్టుబడుల్లో కొంత మందికి లాభాలు రావడంతో మరి కొందరు మంది ఈ యాప్‌లో పెట్టుబడులు పెట్టారని సమాచారం. ఒకరు యాప్‌లో పెట్టుబడి పెట్టి క్రిప్టో యాప్‌కు మరొకరిని పరిచయం చేస్తే సుమారు 500 నుంచి 650 వరకు డాలర్లు వస్తున్నట్లు ప్రచారం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, చిరు వ్యాపారులు, డ్రైవర్లు పలువురు వ్యవసాయదారులు ప్రజాప్రతినిధులను సైతం ఇందులో చేర్పించినట్లు తెలిసింది. క్రిప్టో యాప్‌లో మోసపోయినవారు బయటకు వస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు.

ఒక్కొక్కరు రెండు మూడు ఐడీలు..

ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టినవారు ఒక్కొక్కరు రెండు మూడు ఐడీలు తీసుకుని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఈ యాప్‌ ద్వారా వచ్చిన డాలర్లను ప్రత్యేకమైన వ్యక్తి కొనుగోలు చేయాల్సి ఉండడం గమనార్హం. ఆ వ్యక్తి మొదట కొందరికి మొదట లాభాలు కూడా అందజేసినట్లు తెలిసింది. కొందరికి ఈ యాప్‌ ద్వారా లాభాలు రావడంతో మండలంలోని చాలా గ్రామాల ప్రజలు యాప్‌లో పెట్టుబడి పెట్టినట్లు తెలిసింది. త్రిపురారం మండలంలో ఈ యాప్‌లో దాదాపు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి మోసపోయినట్లు సమాచారం.

ఫ మొదట రూ.50 వేలతో ప్రారంభం

ఫ కోట్ల రూపాయల్లో పెట్టుబడులు ఉన్నట్లు సమాచారం

ఫ మోసపోయిన ప్రజలు

ఫ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని బాధితులు

త్రిపురారం మండలంలో క్రిప్టో యాప్‌ ద్వారా మోసపోయినట్లు మా దృష్టికి రాలేదు. బాధితులు ఫిర్యాదు కూడా చేయలేదు. ప్రజలు అనధికార యాప్‌లను నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోవద్దు. యాప్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.

–గైకూరి నరేష్‌, ఎస్‌ఐ, త్రిపురారం

Advertisement
 
Advertisement
Advertisement