కోదాడ రూరల్ : కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదుట ఉన్న టీస్టాల్ వద్ద బుధవారం రాత్రి భార్య శిరీషను భర్త మణిదీప్ హత్య చేసిన ప్రదేశాన్ని గురువారం ఎస్పీ నరసింహ పరిశీలించారు. హత్య జరిగిన తీరును అక్కడ ఉన్న దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ హత్యకు పాల్పడిన నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుని రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ఆదేశించారు. దర్యాప్తు వేగవంతం చేసి సాక్షులను, బాధిత కుటుంబ సభ్యులను విచారించి నేరాభియోగ పత్రాలను కోర్టుకు సమర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ కలహాలు, ఏదైనా పంచాయితీలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, క్షణికావేశంలో నేరాలు, ఘర్షణలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. కేసుల్లో సాంకేతిక నైపుణ్యంతో దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని అన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ శివశంకర్, ఎస్‌ఐ సుధీర్, సిబ్బంది ఉన్నారు.
బంధువులకు మృతదేహం అప్పగింత
బుధవారం రాత్రి హత్యకు గురైన శిరీష మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. మృతురాలికి మూడేళ్ల వయస్సు ఉన్న కుమారుడు ఉండడంతో అతడికి న్యాయం చేయాలని బంధువులు గురువారం డిమాండ్ చేశారు. దీంతో పెద్దమనుషులు నిందితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా.. వారు కోదాడలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఫ శిరీష హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన ఎస్పీ


