అవగాహన లేక ఆగిపోయిన ఫీడ్‌బ్యాక్
భువనగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీస్వచ్ఛ సర్వేక్షణ్–2026శ్రీ ర్యాంకింగ్ సాధనలో మున్సిపాలిటీలు వెనుకబడుతున్నాయి. సర్వే ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడుస్తున్నా.. ప్రజల్లో అవగాహన కల్పించడంలో మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అత్యంత కీలకమైన సిటిజన్ ఫీడ్‌బ్యాక్‌కు కేటాయించిన 1000 మార్కులను సాధించడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. గడువు సమీపిస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, స్వచ్ఛ ర్యాంకింగ్‌లో భువనగిరి, ఆలేరు సహా జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు అట్టడుగున నిలిచే ప్రమాదం నెలకొంది.
కానరాని ప్రచారం
పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఇందులో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గత నెల 25వ తేదీనే స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. దీనిపై మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలకు కనీస అవగాహన కల్పించ లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ విడుదల చేసిన లింక్ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలోని ఆలేరు, భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో దీనిపై ప్రచారం ఎక్కడా కనిపించడం లేదు.
ఆ 1000 మార్కులు చేజారేనా?
ఈ సర్వేలో పౌరుల అభిప్రాయం (సిటిజన్ ఫీడ్‌బ్యాక్) అత్యంత కీలకం. మున్సిపాలిటీల పనితీరుపై పౌరులు ఇచ్చే సమాధానాలకు మొత్తం 1,000 మార్కులు కేటాయించారు. ఇందుకోసం రూపొందించిన 13 ప్రశ్నలకు ప్రజలు స్పందించాల్సి ఉంటుంది. ఎంత ఎక్కువ మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొంటే ఆ పట్టణానికి అంత మెరుగైన ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, అధికారుల ఉదాసీనత వల్ల ప్రజలకు ఈ విషయమే తెలియడం లేదు. ఫలితంగా జిల్లాలోని పట్టణాల ర్యాంకులు భారీగా పడిపోయే ప్రమాదం ఉంది.
సర్వేలో ప్రాధాన్యతా అంశాలివే..
స్వచ్ఛ సర్వేక్షణ్–2026లో భాగంగా భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు, పోచంపల్లి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో స్వచ్ఛ పోటీ మొదలైంది. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛభారత్ అర్బన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల శుభ్రత, తడి, పొడి చెత్త సేకరణ, డంపింగ్ యార్డులు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలను పరిశీలిస్తూ మొత్తం 12,500 మార్కులను కేటాయించారు. ఇందులో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సర్టిఫికెట్, క్షేత్రస్థాయి పరిశీలన, సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్ వంటి విభాగాలకు ప్రాధాన్యతనిచ్చారు.
ఫ స్వచ్ఛ సర్వేక్షణ్‌పై కదలని మున్సిపల్ యంత్రాంగం
ఫ ప్రచారం లేక ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ప్రజల అనాసక్తి
ఫ ర్యాంకింగ్‌లో వెనుకబడుతున్న మున్సిపాలిటీలు
ఫ 25వ తేదీతో ముగియనున్న గడువు
నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీల పరిధిలో కనీసం 20 శాతం జనాభా నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని పలు మున్సిపాలిటీలలో ఇప్పటివరకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడంతో ఆ 1,000 మార్కులు చేజారిపోయేలా ఉన్నాయి. ఈ నెల 25వ తేదీతో అభిప్రాయ సేకరణ గడువు ముగియనుంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో, అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రచారం వేగవంతం చేయకపోతే స్వచ్ఛ ర్యాంకింగ్‌లో మన పట్టణాలు వెనుకబడటం ఖాయం.


