భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక కౌన్సిల్ హాలులో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో నలుగురు సభ్యులను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కేటగిరీలో పల్లెర్ల యాదగిరి, బడుగు విజయ, అల్ప సంఖ్యాక వర్గాల కేటగిరీలో సుజాయత్ అలి కౌసర్, బట్టు వరలక్ష్మిలను ఎంపిక చేశారు. ఎమ్మెల్యే ఓటు హక్కుతో కలిపి మొత్తం 26 మంది సభ్యులు చేతులెత్తి ఈ ఎన్నికకు మద్దతు తెలిపారు. కొత్తగా ఎన్నికై న సభ్యులతో కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించగా, ఎమ్మెల్యే, చైర్‌పర్సన్ వారికి డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో భువనగిరి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద మౌలిక వసతుల పనులను ఈ నెలాఖరు లోపు పూర్తి చేసి, లబ్ధిదారులకు వెంటనే గృహప్రవేశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఉదయం కోరం లేక సమావేశం వాయిదా ..
అంతకుముందు ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన సమావేశం కోరం లేక మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. మధ్యాహ్నం జరిగిన సమావేశానికి కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 27 మంది హాజరుకాగా, బీజేపీ నలుగురు, బీఆర్‌ఎస్ నలుగురు, స్వతంత్ర అభ్యర్ధి 1 కౌన్సిలర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


