రూ. 100 కోట్లేవి స్వామీ..! | - | Sakshi
Sakshi News home page

రూ. 100 కోట్లేవి స్వామీ..!

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

నెరవేరని ముఖ్యమంత్రి హామీ

పాలకమండలి నియామకమేదీ..

సాక్షి, యాదాద్రి : అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట అభివృద్ధికి నిధుల కొరత గుదిబండగా మారింది. ముఖ్యమంత్రి ఇచ్చిన రూ.100 కోట్ల హామీ ఏడాదైనా అమలుకు నోచుకోకపోవడంతో దుకాణాల సముదాయం, గండి చెరువు సుందరీకరణ, బస్టాండ్‌ వంటి కీలక పనులన్నీ పెండింగ్‌లోనే పడిపోయాయి. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పాలకమండలి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన సైతం కార్యరూపం దాల్చ లేదు. దీంతో అధికారుల పాలనలో పర్యవేక్షణ కొరవడి అవకతవకలు చోటుచేసుకుంటూ దేవస్థానం ప్రతిష్టకు మచ్చ తెస్తున్నాయి.

పెండింగ్‌లోనే పనులు

యాదగిరీశుడి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆధ్యాత్మిక వాడలో నిర్మాణం చేపట్టిన దుకాణాల సముదాయం ఇంకా పూర్తి కాలేదు. శ్రీస్వామి వారి ప్రత్యేక ఉత్సవాల్లో తెప్పోత్సవాన్ని నిర్వహించేందుకు, భక్తులకు ఆహ్లాదాన్ని పంచేందుకు గండి చెరువు సుందరీకరణకు నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సరిపడా నిధులు లేకపోవడంతో ఆ పనులు పూర్తి కాలేదు. యాదగిరి కొండకు దిగువన ఉన్న కల్యాణ కట్ట సమీపంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన దేవస్థానం బస్టాండ్‌ అసంపూర్తిగానే మిగిలిపోయింది. ఇక మొదటి ఘాట్‌ రోడ్డులోని ఆర్యవైశ్య సత్రం నుంచి జీయర్‌ కుటీర్‌ వరకు నిర్మాణం చేస్తున్న ఎంట్రీ ఫ్లై ఓవర్‌ పనులు చివరి దశలో కొనసాగుతున్నాయి. ఇటీవల లండన్‌ నుంచి తీసుకువచ్చిన బ్రిడ్జిని అనుసంధానం చేసే పనులు పూర్తి చేశారు. టెంపుల్‌ సిటీపై విల్లాల నిర్మాణం ఇప్పటి వరకు చేపట్టలేదు. దాతల సహకారంతో అక్కడ విల్లాలు నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం యోచించింది. ఇదిలా ఉండగా ఏడాది క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్టకువచ్చారు. ఆ సందర్భంగా దేవస్థానం అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇంతవరకు నిధులు కేటాయించలేదు. దీంతో అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. వేముల వాడ, భద్రాచలం, బాసర ఆలయాల మాదిరిగా నిధులు మంజూరు చేసి మరింత అభివృద్ది చేయాలని భక్తులు కోరుతున్నారు.

ఫ ఏడాదైనా అందని నిధులు

ఫ యాదగిరిగుట్ట ఆలయంలో

ఎక్కడి పనులు అక్కడే

ఫ పాలకమండలి ఊసే లేదు

యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు అటకెక్కింది. ఏడాది క్రితం తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలో యాదగిరిగుట్టకు పాలక మండలిని నియమిస్తామని సీఎం ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన నూతన చట్టం ప్రకారం 18 మంది సభ్యులతో యాదగిరిగుట్ట పాలకమండలి ఏర్పాటు కావాలి. ఇందులో ప్రభుత్వం తొమ్మిది మందిని నామినేట్‌ చేయనుంది. ఐఏఎస్‌ అధికారి ఈవోగా ఉంటారు. అధికారులు ఈ పాలక మండలిలో ఉంటారు. కానీ ఇంతవరకు పాలక మండలి ఏర్పాటు కాలేదు. దీంతో యాదగిరిగుట్ట క్షేత్రంలో అధికారుల పాలన భక్తులకు అవస్థలను మిగిల్చుతోంది. అఽధికారుల పాలనలో దేవస్థానంలో పలు అవకతవకలు జరుగుతున్నాయి. చింతపండు దొంగతనం, బంగారు డాలర్ల మాయం,గోదాం నుంచి ప్రసాదాల తయారీలో వాడే విలువైన పదార్థాల చోరీలు, ఇలా పలు సంఘటలు దేవస్థానానికి మచ్చ తెచ్చే విధంగా చోటు చేసుకుంటున్నాయి. పాలకవర్గం లేకపోవడం, అధికార యంత్రాంగం సరైన దృష్టి సారించడంలేదన్న ఆరోపణలుఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement