కేంద్రంలో ‘ఏ’ గ్రేడ్‌గా నిర్ధారిస్తే మిల్లర్ వద్దకు వచ్చేసరికి ‘బి’ గ్రేడ్‌గా మార్పు
బొమ్మలరామారం: ధాన్యం కొనుగోళ్ల పక్రియ పారదర్శకంగా వేగవంతగా నిర్వహిస్తున్నామంటున్న అధికారులు క్షేత్ర స్దాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. కొనుగోలు కేంద్రాలలో ఏఈఓల రైతుల ధాన్యాన్ని పరిశీలించి ఏ గ్రేడ్‌గా ధృవీకరిస్తున్నారు. కానీ ఏఈఓ ధ్రువీకరణ మిల్లర్ ఆధిపత్యం ముందు ఓడిపోతోంది. బొమ్మలరామారం మండలంలోని కొనుగోలు కేంద్రాల నుంచి పలు మిల్లర్ల వద్దకు ధాన్యం లోడింగ్ లారీలు వెళ్లగా వారు నానా కొర్రీలు పెడుతున్నారు. బి గ్రేడ్ ధాన్యంగా నమోదు చేస్తేనే అన్‌లోడ్ చేసుకుంటామని, లేదంటే కొనుగోలు కేంద్రాలకు తిరిగి పంపుతామని స్పష్టం చేస్తున్నారు. దీంతో చేసేది లేక బి గ్రేడ్ ధాన్యం లోడ్‌లుగా రికార్డు చేసుకొని అన్‌లోడ్ చేసుకుంటున్నారు.
అధికారుల పర్యవేక్షణ లేక..
మిల్లర్ల ఆధిపత్యం కొనసాగుతున్నా ఏ అధికారి వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఏ గ్రేడ్‌ను బి గ్రేడ్‌గా మారుస్తున్నా, లారీల కొరత వేధిస్తున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.
16వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడి, ఫక్కీరు గూడెం, హాజీపూర్, మైలారం, మేడిపల్లి, రామలింగంపల్లి, పిల్లి గుండ్ల తండా, తిమ్మాపూర్‌లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం నాటికి 10,198 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో బొమ్మలరామారం, నాగినేనిపల్లి, మర్యాల, చౌదర్‌పల్లి, జలాల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 6 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. వీటిలో నాగినేనిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 740 ధాన్యం బస్తాలు మాత్రమే ఏ గ్రేడ్, మిగిలిన ధాన్యం మొత్తం బి గ్రేడ్‌గానే పరిగణనలోకి తీసుకున్నారు. మొత్తం 16 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యం బి గ్రేడ్‌గానే మిల్లర్లు పరిగణనలోకి తీసుకొని నమోదు చేసుకున్నట్లు తెలిసింది.
వేధిస్తున్న లారీల కొరత
బొమ్మలరామారం మండలంలోని కేంద్రాల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు లారీల కొరత వేధిస్తోంది. తూకం వేసిన ధాన్యం రోజులతరబడి కేంద్రాల్లోనే మూలుగుతోంది. కాంటా అయిన ధాన్యం లోడింగ్ అయ్యే వరకు బస్తాలు తడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదేనని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద కాపలాదారులుగా మారారు.


