రామన్నపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)పేరును వీబీజీ రామ్‌జీగా మార్పు చేసి అమలులో పారదర్శకత పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పనుల్లో పారదర్శకత కోసం తీసుకువచ్చిన ముఖ ఆధారిత హాజరు(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) కూలీలతో పాటు, క్షేత్ర సహాయకులకు శాపంగా మారింది. సాంకేతిక సమస్యలతో కూలీల హాజరు నమోదు పెద్ద తలనొప్పిగా మారింది. పలుమార్లు ఫొటో తీసినా అప్‌లోడ్ కాకపోవడంతో గంటల తరబడి ఎండలో నిరీక్షించాల్సి వస్తోంది.
రోజుకూ రెండు సార్లు హాజరు
ఉపాధిహామీ ఫథకం (వీబీజీ రామ్‌జీ)పనులకు వచ్చే కూలీల హాజరును రోజుకూ రెండు సార్లు నమోదు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఉదయం పనికి వచ్చిన వెంటనే కూలీల ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. పని ముగిసిన తరువాత మళ్లీ రెండవసారి తీసి అప్‌లోడ్ చేయాలి. రెండు హాజర్ల మధ్య కాల వ్యవధి కనీసం నాలుగు గంటలు ఉండాలి. ఎండాకాలంలో త్వరగా పని ముగించుకొని వెళ్లాలనుకుంటే కుదరదు. నాలుగు గంటల వ్యవధిలోపల ముఖ చిత్రం తీసుకోదు. అంత వరకు ఎండలో వేచి ఉండాల్సిందే.
ఏ మాత్రం తేడా ఉన్నా అంతే..
మూడేళ్ల క్రితం వరకు కూలీల హాజరును మస్టర్లలో నమోదు చేసే వారు. పని ప్రారంభించిన కొద్దిసేపటి తరువాత మేట్లు కూలీలతో మస్టర్లలో సంతకాలు చేసే వారు. రెండేళ్ల క్రితం హాజరు విధానాన్ని మార్చారు పనికి హాజరైన కూలీల గ్రూప్ ఫొటోను తీస్తే సరిపోయేది. ఇటీవల ప్రతీ కూలీ ఫొటోను ప్రారంభం, ముగింపు సమయాల్లో తీయాలనే నిబంధనను ప్రభుత్వం తీసుకు వచ్చింది. కూలీల ఆధార్‌ను అనుసంధానం చేసి కేవైసీ పూర్తి చేశారు. కూలీల ఫొటో, కనుపాపలను స్కాన్ చేశారు. హాజరు నమోదు సమయంలో ఫొటోలో ఏ చిన్నమార్పు ఉన్నా మిస్ మ్యాచ్ అంటూ తిరస్కరణకు గురి అవుతుంది. వెలుతురు సరిగా లేకపోయినా, ఇంటర్నెట్ రాకున్నా, ఫీల్డ్ అసిస్టెంట్‌ల మొబైల్ క్లారిటీ లేకున్నా హాజరు నమోదు కావడం లేదు. గతంలో ఫొటో తీసిన సమయంలో గడ్డంతో ఉండి ప్రస్తుతం లేక పోయినా, అప్పట్లో గడ్డం లేకుండా ఉండి ఇప్పుడు గడ్డం ఉన్నా ఫొటో తీసుకోవడం లేదని కూలీలు ఆవేదన చెందుతున్నారు. కొందరు కూలీలు సబ్బుతో ముఖం కడిగి పౌడర్ వేస్తే తప్ప ఫొటో తీసుకోవడం లేదు. ప్రతీ పనిప్రదేశంలో ఒకరిద్దరు కూలీల ఫొటో నమోదు కోసమైనా గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, లేకుంటే ఆ రోజు హాజరు పడక వేతనం కోల్పోవాల్సి వస్తుందనే ఆవేదన కూలీల్లో వ్యక్తమవుతోంది.
ఫ నెట్ రాక.. ఫొటో దిగక..
ఫ గంటల కొద్దీ ఎండలోనే నిరీక్షణ
ఫ పని చేసినా పడని హాజరు


