దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

భువనగిరిటౌన్‌ : రాష్ట్రంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, వికలాంగుల సంస్థ, భారత ప్రభుత్వరంగ చమురు సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం దివ్యాంగులకు విడతల వారీగా పరికరాలను పంపిణీ చేస్తోందని, రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని, పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని స్పష్టం చేశారు.

దివ్యాంగుల రక్షకుడు సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగుల కోసం పెద్ద ఎత్తున సహాయక పరికరాలు పంపిణీ చేయడం ఇదే మొదటిసారి అని కొనియాడారు. ఉద్యోగాల్లో నాలుగు శాతం, ఉన్నత విద్యలో ఐదు శాతం, ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం, యువ వికాస పథకంలో ఐదు శాతం కేటాయింపులు చేసి దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు మాట్లాడుతూ ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా దివ్యాంగులకు పరికరాలు అందించడం మంచి పరిణామమని అన్నారు. జిల్లాలో మొత్తం 600 మందికి పైగా లబ్ధిదారులకు ఈ పరికరాలను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అవేజ్‌ చిస్తీ, శిశు అభివృద్ధి పథక అధికారులు వెంకట రమణ, శైలజ, స్వరాజ్యం, నాజీ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement