అమూల్యమైనదే.. | - | Sakshi
Sakshi News home page

అమూల్యమైనదే..

May 7 2026 9:50 AM | Updated on May 7 2026 9:50 AM

ప్రేమతో ఇచ్చేది ఏదైనా

వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ వద్దకు వెళ్లినప్పడు ఆమె నాకు చాలా నీతి కథలు చెప్పేది. అందులో ఈ ఉడుత దూరదృష్టి కథ చాలా బాగా నచ్చింది.

చిలుకూరు : అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి. ఆ జంతువులన్నీ కలిసిమెలిసి ఉంటున్నాయి. ఓ రోజు అడవికి రాజైన సింహం తన పుట్టినరోజుకు రావాలని మిగిలిన జంతువులకు ఆహ్వానం పంపింది. అడవికి సింహాం రాజు కావడంతో పుట్టినరోజుకు జంతువులన్నీ తప్పనిసరిగా వెళ్లాలని అనుకున్నాయి. ఈ క్రమంలో తమ తమ స్థాయిని బట్టి ఏదో ఒక బహుమతిని ఇవ్వాలని వేటికి అవే అనుకున్నాయి. దీంతో ఒక్కో జంతువు ఒక్కోరకంగా పూల గుత్తి, మిఠాయిలు, బంగారు కిరీటాలు, వెండి కడియాలు తదితర విలువైన బహుమతులు తీసుకెళ్లాయి. అయితే బహుమతి తీసుకెళ్లేంత స్థామత లేని ఉడుత ఏ బహుమతి తీసుకెళ్లాలో అర్ధంకాక బాధపడుతూ ఉంది. సింహం స్థాయికి తగిన బహుమతి ఇవ్వకపోతే ఏమైతుందో అని దీర్ఘాలోచనలో పడింది. ఈ క్రమంలో ఉడుతకు ఒక ఆలోచన తట్టింది. వెంటనే ఆ ఉడుత అడవిలో తిరుగుతూ ఎండిన చెట్ల గింజలను ఏరుకొని వచ్చి ఆ గింజలను వెదురు బొంగులో పోసి దానిని ఆకర్షణీయంగా తయారు చేసి సింహాంకు అందజేసింది. పుట్టినరోజు వేడుకల అనంతరం మిత్రులు తెచ్చిన బహుమతులను సింహం పరిశీలిస్తుండగా అన్నీ చాలా విలువైనవి కనిపించాయి. ఈ క్రమంలో ఉడుత ఇచ్చిన వెదురు బొంగు బహుమతి విచిత్రంగా కనిపించింది. దీంతో మిగతా జంతువులు నవ్వాయి. అయితే మిగతా జంతువులు ఇచ్చిన బహుమతులు తాత్కాలిక ఆనందాన్ని, ప్రయోజనాన్ని కలిగించేవి కాగా.. ఉడుత ఇచ్చిన బహుమతితో దీర్ఘకాలిక ప్రయోజనం ఉందని సింహం, మిగతా జంతువులు గ్రహించాయి. అదేమిటంటే వెదరు బొంగులోని విత్తనాలన్నీ నాటితే వృక్ష సంపద పెరిగి పండ్లు, ఫలాలు అందుతాయని, అంతేకాకుండా తమ మనుగడకు భవిష్యత్‌లో దట్టమైన అడవిని అందించగలవని గ్రహించాయి. వెంటనే జంతువులన్నీ కలిసి గింజలను భూమిలో నాటాయి. ఉడుత దీర్ఘ దృష్టిని మిగతా జంతువులు మెచ్చుకున్నాయి. మరి మీరు కూడా ఎండిన విత్తనాలను సేకరించి రాబోయే వర్షాకాలంలో భూమిలో నాటి మంచి వన సంపదను పెంపొందించాలని నేను ఆశిస్తున్నాను.

నీతి : బహుమతి విలువ దాని ధరలో ఉండదు. అది ఇచ్చే వారి ప్రేమపై ఆధారపడి ఉంటుంది. చిన్నదైనా సరే ప్రేమతో ఇచ్చేది ఎంతో అమూల్యమైనది.

అమ్మమ్మ చెప్పిన నీతి కథ

Advertisement
 
Advertisement
Advertisement