నాలాల సర్వే ఎటుపోయింది! | - | Sakshi
Sakshi News home page

నాలాల సర్వే ఎటుపోయింది!

May 4 2026 6:49 AM | Updated on May 4 2026 6:49 AM

ఐదు ప్రధాన నాలాలు

ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీలో ప్రధాన నాలాలు ఆక్రమణకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేకుండా పోయింది. ఆక్రమణలను గుర్తించడంలో మున్సిపల్‌, రెవెన్యూ శాఖల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆక్రమణల గుర్తింపునకు సంయుక్త సర్వే చేపట్టనున్నట్టు రెండు శాఖల అధికారులు ప్రకటించి నెలలు గడుస్తున్నా పురోగతి శూన్యం. నాలాల కబ్జాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య సూచించినా అధికారులు కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముంపు సమస్యపై ప్రజాప్రతినిధులు, అధికారులు కేవలం ప్రకటనలు చేసి వదిలేయడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలాల ఆక్రమణలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లూ చేపట్టలేదు. దాంతో వచ్చే వానా కాలంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకోస్తుందోనని ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ సమస్య..

ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, ప్రగతి స్కూల్‌, పాత పంచాయతీ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి నుంచి ఈదమ్మ గుడి వరకు ప్రతి సంవత్సరం వానా కాలంలో వరదలు ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు మూడు వేల ఇళ్లు, ఆరు వేల జనాభా ఉంది. వర్షాలు కురిస్తే ఇళ్లలోకి నీరు చేరి సరుకులు, సామగ్రి పూర్తిగా తడిసి పోతాయి. ప్రజలు కూడా రాత్రంతా నిద్రలేకుండా గడపాల్సిన దుస్థితి నెలకొంటుంది.

గత ఏడాది..

గత ఏడాది సెప్టెంబర్‌లో భారీ వర్షాలతో ఆయా కాలనీలు జలయమం అయ్యాయి. ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆర్డీఓ కృష్ణారెడ్డి ఇతర అధికారులు సందర్శించారు. ఈ సమయంలో నాలాల కబ్జాల వల్లే వరదలు ముంచెత్తి కాలనీలను అతలాకుతలం చేస్తున్నాయని ముంపు బాధితులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే వరదలకు కారణమైన నాలాల ఆక్రమణల ను తొలగించి, ముంపు సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల పరిశీలనలో..

కొందరు రియల్టర్లు లేఅవుట్‌లు చేయడం, మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా గృహనిర్మాణాలు చేపట్టడం వల్ల నాలాలు ఆక్రమణలకు గురైనట్టు అప్పట్లో అధికారులు గుర్తించారు. ఆక్రమణలతో నాలాలు కుంచించుకుపోయి వరద నీరు ముందుకు పోలేక ఇళ్లను ముంచెత్తుతున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దాంతో మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు నాలాల ఆక్రమణల గుర్తింపునకు సంయుక్తంగా సర్వే చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేసి, సదరు యజమానుల నుంచి వివరణ తీసుకుంటామని ప్రకటించి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

పిచ్చిమొక్కలు, మట్టి దిబ్బలతో ఆనవాళ్లు కోల్పోయిన ఆలేరు పట్టణంలోని నాలా

బృందావన్‌ కాలనీ సమీపంలో ఆక్రమణలతో కుంచించుకు పోయిన నాలా

పట్టణ శివారులోని బైరవకుంట, పర్రెకాల్వ నుంచి శ్రీరామకృష్ణ విద్యాలయం వరకు దాదాపు 9 కిలోమీటర్ల పొడవుతో ఐదు ప్రధాన వరద నాలాలు ఉన్నాయి. ఎగువన ఉన్న రెండు కుంటలు నిండితే 10,11,12 వార్డుల పరిధిలోని కల్వర్టులు, నాలాల మీదుగా వరదనీరు వెళ్లి, బైపాస్‌ సమీపంలోని పెద్దవాగులో కలుస్తాయి. కానీ నాలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, మట్టి దిబ్బలు అడ్డుగా ఉండటంతో ప్రతి వర్షాకాలంలో వరద నీరు సాఫీగా ముందుకు వెళ్లక కాలనీలను ముంచెత్తుతోంది. రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, ప్రగతి స్కూల్‌, పాత పంచాయతీ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి నుంచి ఈదమ్మ టెంపుల్‌ వరకు ఉన్న ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదలతో గత ఏడాది ఆస్తినష్టం కూడా వాటిల్లింది. వరద తీవ్రత ఎక్కువై ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఫ ఆలేరు మున్సిపాలిటీలో ఆక్రమణల గుర్తింపులో జాప్యం

ఫ రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల మధ్య సమన్వయ లోపం

ఫ ఇష్టానుసారంగా నిర్మాణాలు

ఫ ప్రభుత్వ విప్‌ చెప్పినా కదలని యంత్రాంగం

ఫ ముంపు గుప్పిట్లో కాలనీలు

Advertisement
 
Advertisement
Advertisement