వేగంగా అర్జీల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

వేగంగా అర్జీల పరిష్కారం

May 4 2026 6:49 AM | Updated on May 4 2026 6:49 AM

నేటి నుంచి ఆర్డీఓ కార్యాలయాల్లో..

నేటి నుంచి డివిజన్‌ స్థాయిలోనూ ప్రజావాణి

ప్రభుత్వం ఆదేశాల మే రకు ఇక నుంచి ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో ప్రజా వాణి కార్యక్రమం జరుగుతుంది. ఆర్‌డీఓ (రెవెన్యూ డివిజనల్‌ అధికారి) నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. అన్ని శాఖల డివిజన్‌ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై, ప్రజల వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషిచేస్తారు. ప్రతి వినతిని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేసి యూనిక్‌ రిఫరెన్స్‌ నంబర్‌తో కూడిన రశీదు పత్రం ఇస్తాం.

– అనురాగ్‌ జయంతి, కలెక్టర్‌

సాక్షి, యాదాద్రి : ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమంలో మార్పులు చేస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీలను గరిష్టంగా 30 రోజుల్లోగా పరిష్కరించేలా కార్యాచరణ సిద్ధం చేసింది. దీంట్లో భాగంగా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ప్రభుత్వ శాఖలో ప్రత్యేకంగా ప్రజావాణి విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో ఇకనుంచి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తోపాటు భువనగిరి, చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలపై వినతులు స్వీకరిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా..

ఇకనుంచి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. సబ్‌ కలెక్టర్‌ లేదా ఆర్డీఓ కార్యాలయాల్లో జరిగే ఈ కార్యక్రమనికి డీఎల్‌పీఓ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, వ్యవసాయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డిస్కం డీఈ, ఆర్‌ అండ్‌ బీ డీఈఈ, సీడీపీఓ తదితర అధికారులు హాజరై సమస్యల పరిష్కారానికి కృషిచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రజలకు ప్రయాణ భారం తగ్గి, తమ నివాస ప్రాంతాలకు దగ్గరలోనే ఉన్నతాధికారులను కలిసే అవకాశం కలుగుతుంది. ఎప్పటిలాగానే జిల్లాస్థాయి ప్రజావాణికి కలెక్టర్‌ జిల్లా నోడల్‌ అధికారిగా, అదనపు కలెక్టర్‌ అదనపు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరై ప్రజల విజ్ఞప్తులను స్వీకరించాల్సి ఉంటుంది.

డిజిటల్‌ పర్యవేక్షణకు సీజీజీ పోర్టల్‌

ప్రజావాణి ప్రక్రియలో పారదర్శకతను పెంచేలా ప్రభుత్వం డిజిటల్‌ విధానాన్ని తప్పనిసరి చేసింది. ప్రజల నుంచి వచ్చిన ప్రతి పిటిషన్‌ను వెంటనే ‘సీజీజీ’ (సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌) ప్రజావాణి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి స్పష్టం చేశారు. ప్రతి వినతికి ఒక ప్రత్యేక ఐడీ (యూనిక్‌ రిఫరెన్స్‌ నంబర్‌)తో కూడిన రిసిఫ్ట్‌ను దరఖాస్తుదారుడికి అందజేస్తారు. దీనిద్వారా ప్రజలు తమ విన్నపం ఏ స్థితిలో ఉందో ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

గడువులోగా పరిష్కారం చూపకపోతే..

స్వీకరించిన ఫిర్యాదులను గరిష్టంగా 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలను కూడా పోర్టల్‌లో ఉంచాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా పరి ష్కారం చూపకపోతే, ఆ కేసులు ఆటోమేటిక్‌గా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోకి వాటికవే వెళ్తాయి. ఉన్నతాధికారులకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఫిర్యాదుదారులకు వసతులు

డివిజన్‌ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కోసం ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కుర్చీలు, వఅత్యవసర వైద్యసేవలు వంటి వసతులు కల్పిస్తారు. కాగా భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్డీఓ కార్యాలయాలను ప్రజావాణి కోసం సిద్ధం చేశారు.

ఫ కలెక్టరేట్‌తోపాటు భువనగిరి, చౌటుప్పల్‌లో నిర్వహణ

ఫ గరిష్టంగా 30 రోజుల్లో పరిష్కరించేలా కార్యాచరణ

ఫ సీజీజీ పోర్టల్‌ ద్వారా పర్యవేక్షణ

ఫ మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement