సమాజ సేవకు ముందుకు రండి | - | Sakshi
Sakshi News home page

సమాజ సేవకు ముందుకు రండి

May 4 2026 6:49 AM | Updated on May 4 2026 6:49 AM

మోత్కూరు : సమాజ సేవ చేయాలనుకునే వారు రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేరాలని రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ లక్ష్మీనర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మోత్కూరులో రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదు స్పెషల్‌ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 31 వరకు జిల్లాలో రెడ్‌క్రాస్‌ సభ్యత్వ నమోదు కోసం స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగనుందన్నారు. రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, ఐఆర్‌సీఎస్‌ రాష్ట్ర చైర్మన్‌ దాన కిషోర్‌ నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని రాయగిరి రోడ్డు పాత వివేరా హోటల్‌ పక్కన ఉన్న రెడ్‌క్రాస్‌ భవనంలో సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. దరఖాస్తు ఫామ్‌ పూర్తి చేసి రెండు పాస్‌ పోర్టు సైజ్‌ ఫొటోలు, ఆధార్‌ కార్డుతో పాటు రూ.1,160తో కార్యాలయంలో ఇవ్వాలని, పరిశీలించిన అనంతరం శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు సెల్‌ : 8985960689, 99599 97750 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ యూత్‌ వింగ్‌ జిల్లా అధ్యక్షుడు బీసు మత్స్యగిరి, మోత్కూరు మండల ఉపాధ్యక్షుడు ముప్ప వెంకట్‌రెడ్డి, ముప్ప తిరుమల్‌రెడ్డి, అవిరేని శోభన్‌బాబు, శ్రీనివాసరావు, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

ధాన్యాన్ని ఎప్పటికప్పుడుదిగుమతి చేసుకోవాలి

భువనగిరి : లారీల్లో తెచ్చిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు ఎప్పటికప్పుడు దిగుమతి చేసుకోవాలని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఆదివారం భువనగిరిలోని శివ రైస్‌ మిల్లును ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం లోడుతో ఉన్న లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం దిగుమతి కోసం సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం దిగుమతిలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది, మిల్లు యజమానులు ఉన్నారు.

జాబ్‌మేళా విజయవంతం

నల్లగొండ : నల్లగొండలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా విజయవంతం అయ్యిందని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్‌ అలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాలకు ఈ నెల 2న 125 కంపెనీలు, 2000 మంది నిరుద్యోగులు హాజరు కాగా, 3న 23 కంపెనీలు, 150 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళా ద్వారా అనేక మందికి ఉద్యోగాలు లభిచాయని తెలిపారు.

సామాజిక ఉద్యమంలా ‘రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు’

నల్లగొండ టౌన్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 27 నుంచి నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు, అన్నదాతల అవగాహన కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్వహిస్తామని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ అందాస్‌ జానయ్య తెలిపారు. ఆదివారం నల్లగొండలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో యూనివర్సిటీ సైంటిస్టులు, వివిధ పరిశోధన కేంద్రాలకు చెందిన సైంటిస్టులు, వ్యవసాయ శాఖ అధికారులు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. ఎరువుల వాడకం, సాగు ఖర్చు తగ్గించడం, భూసారం పరిరక్షణ, పంటల మార్పిడి విధానంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే కంపాసాగర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.లింగయ్య, శాస్త్రవేత్తలు డాక్టర్‌ జి.శివప్రసాద్‌, కె.సంధ్యారాణి, జి.స్వాతి, ఎ.రాములమ్మ, హిమబింధు, సాయిప్రియ, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement