కార్యాచరణ ఇలా..
ఒక్కో సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఎక్కువగా ఉన్నారు
భువనగిరి : పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను గట్టెక్కించేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పటికే పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించి, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు 152 మంది
గత మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఆయా పరీక్షలకు మొత్తం 8,918 మంది విద్యార్థులు హాజరు కాగా 8,766 మంది ఉత్తీర్ణులయ్యారు. 152 మంది ఫెయిల్ అయ్యారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 105 మంది ఉన్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు పాస్ అయ్యేలా రూపొందించిన కార్యాచరణను అమలు చేయనున్నారు. తెలుగు, ఇంగ్లీష్, ఆ తర్వాత గణితంలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తెలుగులో తడబడ్డారు.
పరీక్షలకు తక్కువ వ్యవధి
జూన్ 5 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అడ్వాన్స్‌డ్ సఫ్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. తక్కువ వ్యవధి ఉండటంతో విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థికి ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తున్నారు.
వృత్యంతర శిక్షణలో ఉపాధ్యాయులు
ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు జనగణన ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో సుమారు 80 శాతం వరకు ఉపాధ్యాయులకు ఈ విధులు నిర్వహించేందుకు కేటాయించారు. ఇప్పటికే వీరికి జనగణన పై శిక్షణఇస్తున్నారు. ఇలాంటి సందర్భంలో సంబంధిత సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులుంటే వారి పరిస్థితి ఎలా అన్ని సందేహాలు ఉన్నాయి.
మండలాల వారీగా ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడో ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఉపాధ్యాయుడు వారిని దత్తత తీసుకోవాలి. విద్యార్థులకు నేరుగా గానీ లేదా వీలును బట్టి వాట్సప్ ద్వారా ముఖ్యమైన అంశాలను వివరించడంతో పాటు చదువుకునేందుకు ముఖ్యమైన అంశాలు ఇవ్వాలి. ఎక్కువ మంది ఫెయిలైన విద్యార్థులకు నేరుగా పాఠశాలకు రప్పించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలి.
ఫ ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ కార్యాచరణ
ఫ ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 105 మంది
ఫ జూన్ 5వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
జిల్లాలో సుమారు 70 పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇందులో ఒక్కో సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే సమావేశం నిర్వహించి ప్రధానోధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. జనగణన నిర్వహించే వారు విధుల అనంతరం ఫోన్ ద్వారా ప్రత్యేకంగా సందేహాలు నివృతి చేయనున్నారు.
– సత్యనారాయణ, డీఈఓ


