నేటి నుంచి రైతు వారం | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రైతు వారం

May 4 2026 6:49 AM | Updated on May 4 2026 6:49 AM

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

భువనగిరి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు రైతు వారం నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నాయి. పంటల సాగు, సస్యరక్షణ చర్యలు, సేంద్రియ వ్యవసాయం వంటి తదితర అంశాలపై సదస్సుల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు.

కార్యాచరణ ఇలా..

మొదటి రోజు : నేల ఆరోగ్య పరిరక్షణ, సమతుల్య ఎరువుల యాజమాన్యం–ప్రకృతి, పౌరసరఫరాల శాఖ వినయోగదారులు కోరుకునే సన్నవరి రకాల సాగుపై అవగాహన కల్పించి భూసార పరీక్ష ఫలితాల కార్డులు అందజేస్తారు.

రెండో రోజు : నియోజకవర్గ స్థాయిలో ఉద్వాన పంటల సాగు–ఆయిల్‌ పామ్‌ సాగువిస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలను వివరిస్తారు.

మూడో రోజు : రైతు వేదికల్లో బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్‌పీఓల ద్వారా రైతులకు అందించే సేవలను తెలియజేస్తారు.

నాలుగో రోజు : నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్‌ కేంద్రాలు, పీఎం కుసుమ్‌, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్‌ వినియోగంపై వివరిస్తారు.

ఐదో రోజు : పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాడి పరిశ్రమ–పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు–వేసవి పశుసంరక్షణ కార్యక్రమం, మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులలో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నివారణ, అధికోత్పత్తికి చర్యలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సమర్థ నీటి విడుదల, గేట్ల నిర్వహణ, కాల్వల్లో కంపచెట్లు, గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తారు.

ఆరో రోజు : గ్రామస్థాయిలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రతపై తెలియజేస్తారు.

రైతు వారం కార్యక్రమాన్ని ఆరు రోజులపాటు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి రైతులు హాజరై వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల అధికారులు అందించే సమాచారాన్ని తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలి.

– రమణారెడ్డి,

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి

ఫ సాగు పద్ధతులు, పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం

ఫ వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో సదస్సులు

ఫ తొలిరోజు భూసార పరీక్షఫలితాల కార్డులు అందజేత

Advertisement
 
Advertisement
Advertisement