యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. ఆదివారం వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజను సంప్రదాయంగా జరిపించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను ఊరేగించారు.


