భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌గా చంద్రప్రకాష్‌ రెడ్డి | - | Sakshi
Sakshi News home page

భువనగిరి మున్సిపల్‌ కమిషనర్‌గా చంద్రప్రకాష్‌ రెడ్డి

May 1 2026 8:02 AM | Updated on May 1 2026 8:02 AM

భువనగిరిటౌన్‌ : భువనగిరి మున్సిపాలిటీ కొత్త కమిషనర్‌గా చంద్రప్రకాష్‌ రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు నాచారం మున్సిపాలిటీలో సేవలు అందించిన ఆయనను భువనగిరికి బదిలీ చేస్తూ సీడీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి కమిషనర్‌ రామలింగం 15రోజుల క్రితం జీహెచ్‌ఎంసీకి బదిలీ కాగా డీఈ కొండలరావు ఇన్‌చార్జి కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చంద్రప్రకాష్‌రెడ్డి శుక్రవారం లేదా సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి

సాక్షి, యాదాద్రి : కొనుగోళ్లు ముమ్మరమవుతున్న నేపథ్యంలో రైస్‌ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని, ఇందుకోసం హమాలీల సంఖ్యను పెంచుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి ఆదేశించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లోధాన్యం కొనుగోళ్లపై మిల్లర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ప్రక్రియ నిరంతరం కొనసాగేలా షిఫ్టుల వారీగా పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్‌ ఆర్‌డీఓలు, డీసీఎస్‌ఓ, డీఎంసీఎస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నేటి నుంచి యాదగిరి క్షేత్రంలో నిత్య గిరి ప్రదక్షిణ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 5.30గంటలకు నిత్య గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి కొండకు దిగువన ఉన్న వైకుంఠద్వారం వద్ద రాతి పాదాలను ఏర్పాటు చేశారు. ఈ పాదాల చెంత భక్తులు మొక్కుకొని యాదగిరి కొండ చుట్టూ తిరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈఓ భవాని శంకర్‌ వెల్లడించారు. స్వాతి నక్షత్రం రోజునే కాకుండా ప్రతి రోజు భక్తులు గిరి ప్రదక్షిణ చేసే విధంగా అధికారులు ఈ నిత్య గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

5న సామూహిక నిరాహార దీక్ష

తిరుమలగిరి(తుంగతుర్తి) : తెలంగాణ ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 5న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద జరిగే సామూహిక నిరాహార దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోరారు. గురువారం తిరుమలగిరి పెన్షనర్స్‌ భవన్‌లో రిటైర్డ్‌ ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండవ పీఆర్‌సీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ కార్డుల విధి విధానాలు రూపొందించి వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంకెపల్లి విఠల్‌రెడ్డి, బి.రాంబాబు, డి.శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఎం.పద్మారెడ్డి, ఎస్‌.నర్సయ్య, కె.వెంకట్‌రెడ్డి, నర్సయ్య, డి.నారాయణ, కె.యాదయ్య, భిక్షం, సోమనారాయణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement