సాక్షి, యాదాద్రి : అభివృద్ధి పనులకు అవసరమైన వనరుల వినియోగంలో అన్ని శాఖల సమన్వయం అవసరమని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్) నిధుల వినియోగంపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సీఎస్‌ఆర్ నిధులను సమర్థంగా వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన ప్రాధాన్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను సేకరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి రవీందర్ పాల్గొన్నారు.
మొబైల్ యాప్‌లో ఎంట్రీ చేయాలి
మండల స్పెషల్ అధికారులు హాస్టల్స్ పర్యవేక్షణ సమయంలో గుర్తించిన సమస్యలను ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో ఎంట్రీ చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో మండల స్పెషల్ అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి తో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
పెట్రోల్, డీజిల్ కొరత లేదు
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో వివిధ చమురు సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


