ఇంధనం.. ఇక్కట్లు | - | Sakshi
Sakshi News home page

ఇంధనం.. ఇక్కట్లు

Apr 29 2026 8:36 AM | Updated on Apr 29 2026 8:36 AM

నా దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది

ఎక్కువ పెట్రోల్‌ పోయించుకున్నా

సాక్షి, యాదాద్రి : ఇంధన సంక్షోభం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 153 పెట్రోల్‌ బంకుల్లో మెజారిటీ చోట్ల ‘నో స్టాక్‌’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం కిలోమీటర్ల మేర బారులుదీరాల్సి వస్తోంది. మరోవైపు, ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయం రవాణా వ్యవస్థను స్తంభింపజేయడమే కాకుండా, వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో ఆయిల్‌ కంపెనీలు క్రెడిట్‌ ప్రాతిపదికన సరఫరా చేసేవారు. కానీ ప్రస్తుతం డీడీలు చెల్లించిన వారికి మాత్రమే సరఫరా చేస్తున్నారు. భారీ వాహనాల నుంచి సకాలంలో బకాయిలు వసూలు కాకపోవడంతో కొత్త డీడీలు చెల్లించడానికి నిర్వాహకులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ డీడీలు చెల్లించినా సకాలంలో ట్యాంకర్లు రావడంలేదని బంకుల యజమానులు చెబుతున్నారు. బంకుల వద్ద పరిస్థితిపై మంగళవారం సాక్షి విజిట్‌ నిర్వహించింది.

● చౌటుప్పల్‌ మున్సిపాలిటీతో పాటు మండలంలో ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బంకులు మూసివేశారు. సగానికి పైగా పెట్రోల్‌ బంకుల్లో నో స్టాక్‌ బోర్డులు పెట్టారు. స్టాక్‌ వచ్చిన బంకుల్లో పెట్రోల్‌ డీజిల్‌ కోసం వాహనాలు బారులు దీరాయి.

● భువనగిరి పట్టణంలో బంకుల వద్ద వాహనాలు బారులు దీరాయి. పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. క్యూలైన్లతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.

● భూదాన్‌ పోచంపల్లి మండలంలో రెండు బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు పెట్టారు. మిగిలిన బంకుల వద్ద ఇంధనం కోసం వాహనాలు బారులుదీరారు. అడ్డగూడూర్‌ మండలంలోని బంకులో పెట్రోల్‌, డీజిల్‌ లేకపోవడంతో లోపలికి ఎవరూ రాకుండా రాళ్లుపెట్టి తాడు కట్టారు. వ్యవసాయ పనుల సీజన్‌ కావడంతో డోజర్లు, ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలకు డీజిల్‌ దొరకక ఇబ్బందులు పడ్డారు.

● యాదగిరిగుట్ట పట్టణంలో నాలుగు పెట్రోల్‌ బంకులు ఉండగా ఇందులో మూడు బంకుల్లో డీజిల్‌, పెట్రోలు లేదంటూ బోర్డులు పెట్టారు. అలాగే బంకు లోపలికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చిన భక్తులు స్థానిక బంకుల్లో పెట్రోల్‌, డీజిల్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు.

● ఆత్మకూరు(ఎం)లోని బంకులో పెట్రోల్‌, డీజిల్‌ లేకపోవడంతో లోపలికి ఎవరూ వెళ్లకుండా తాడు కట్టారు. దీంతో వాహనదారులు మోత్కూర్‌, చాడ, ఖప్రాయపల్లి, రాజన్నగూడెంలోని పెట్రోల్‌ బంకుల వద్దకు వెళ్తున్నారు.

● రాజాపేటలో మూడు పెట్రోల్‌ బంకులు ఉండగా.. రెండింటిలో డీజిల్‌ కొరత ఉంది. మూడింటిలో పెట్రోల్‌ ఉండగా వాటివద్ద వాహనదారులు బారులుదీరారు. డీజిల్‌ లేకపోవడంతో నో స్టాక్‌ బోర్డు ఏర్పాటు చేస్తే పెట్రోల్‌ కూడా లేదు అనుకుంటారని బోర్డులు మాత్రం పెట్టలేదు. ఆలేరులో ఉన్న రెండు పెట్రోల్‌ బంకుల్లో నోస్టాక్‌ బోర్డు పెట్టారు. గుండాలలో ఇదే పరిస్థితి నెలకొంది.

ఫ పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకుల వద్ద వాహనదారుల బారులు

ఫ చాలాచోట్ల నోస్టాక్‌ బోర్డులు దర్శనం

ఫ వ్యవసాయ పనులు, రవాణా వ్యవస్థపై ప్రభావం

డీజిల్‌ కోసం గంటసేపు క్యూలో నిలబడ్డ. నాదగ్గరకు వచ్చేసరికి డీజిల్‌ అయిపోయింది. మరో లోడు వస్తుంది ఆగమంటే ఇక్కడే నిలబడ్డా. నేను ఆటో నడుపుకుంటూ కుటుంభాన్ని పోషించుకుంటాను. ఈ రోజు డీజిల్‌ దొరక్కపోతే రేపు ఆటో ఇంటి వద్దనే ఉంటుంది.

– శ్రీనివాస్‌ , ఆటో డ్రైవర్‌, భువనగిరి

నేను నా వాహనంలో రూ.300 పెట్రోల్‌ పోయించుకునే వాడిని.కానీ ఇప్పుడు పెట్రోల్‌ కొరత అంటున్నారని రూ.800 పెట్రోల్‌ పోయించుకున్నా. పెట్రోల్‌ కోసం అరగంట సేపు లైన్లో నిలబడ్డా. పెట్రోల్‌ కొరత ఎందుకు వస్తుందో తెలియడంలేదు. వెంటనే సమస్యను పరిష్కరించాలి.

– జయచంద్ర, వాహనదారుడు, చౌటుప్పల్‌

Advertisement
 
Advertisement
Advertisement