భువనగిరిటౌన్ : కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 1950 నాటి రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని, తద్వారా దళిత క్రైస్తవుల హక్కులను కాపాడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామకు వెళ్తూ మార్గమధ్యలో వివేరా హోటల్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు నల్ల చంద్రస్వామి మాదిగ, రాష్ట్ర సహాయ కార్యదర్శి దేవేందర్ మాదిగ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వారి ఎస్సీ హోదా, రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దవుతాయని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడారు. దీనికోసం ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్రై స్తవ మతంలో ఉన్న దళితులతో జిల్లా మహాసభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో కూడా భారీ ఎత్తున జిల్లా మహాసభను ఏర్పాటు చేసి, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని మందకష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


