భువనగిరి: ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా పంటలు సాగు చేయడం వల్ల అధిక దిగుబడి వస్తుందని తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన కేంద్రం జిల్లా ప్రధాన శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీలత పేర్కొన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను ఉపయోగించాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సమతుల్యత విధానాన్ని పాటించాలన్నారు. పంటల మార్పిడి విధానం ద్వారా దిగుబడి పెరిగి రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. అనంతరం నీటి సంరక్షణ, వినియోగం, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాముఖ్యత, సమగ్ర పురుగుల నివారణ పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ మల్లేష్, ఏఈఓ వెంకట్రావు, ఉద్యాన అధికారి మంజుల, కౌన్సిలర్ శ్రీవాణిగణేష్, ప్రసన్నకుమార్, ఆదర్శ రైతులు మల్లయ్య, నరసింహారెడ్డి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.


