అనంతగిరి : రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన అనంతగిరి మండలం ఖానాపురం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపురం గ్రామానికి చెందిన కనగాల రామకోటమ్మ(72) మంగళవారం ఉదయం ఇంటి నుంచి బజారుకు వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన పల్లపు నాగరాజు ఇసుక ట్రాక్టర్‌ను రివర్స్ చేస్తూ రామకోటమ్మను ఢీకొట్టాడు. దీంతో రామకోటమ్మ కిందపడిపోగా ఆమె తల పైనుంచి ట్రాక్టర్ టైర్లు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. మృతురాలి కుమారుడు శేషయ్య ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పల్లపు నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సీహెచ్. లింగారెడ్డి తెలిపారు.
20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
మర్రిగూడ(చింతపల్లి) : అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం చింతపల్లి మండలం కేంద్రంలోని విరాట్‌నగర్ కాలనీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. విరాట్‌నగర్ కాలనీ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగిళ్ల శ్రీకాంత్ 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గూడ్స్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ మేరకు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


