మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున టిప్పర్, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ నుంచి అడ్డగూడూరు వైపు వెళ్తున్న టిప్పర్, భద్రాచలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీ మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ జాల లింగస్వామి, టిప్పర్ డ్రైవర్ బి. మల్లేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయా వాహనాల్లో ఇరుక్కున్న డ్రైవర్లను స్థానికులు ఎంతో శ్రమించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లు,సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.


