యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహుడి జయంతి ఉత్సవాలలో వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం మూడో రోజు స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపించారు. అనంతరం లక్ష్మీనృసింహస్వామిని విశేషంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగిస్తూ ఉత్తర మాడ వీధిలోని యాగశాలకు తీసుకెళ్లారు. యాగశాలలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠించి ద్వారతోరణ పూజ నిర్వహించారు. పంచకుండాల్లో మూర్తికుంభారాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమం, నిత్య పూర్ణాహుతి చేపట్టారు. యాగశాలలో చతుస్థానములలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అధిష్టాన స్వరూపులైన దేవతలను షోడశోపచారములతో ఆరాధన చేసి, నైవేద్యం సమర్పించారు.
గరుడ వాహనంపై ఊరేగింపు..
సాయంత్రం ఆలయంలో అర్చకులు నిత్యరాధనలు జరిపించారు. అనంతరం నృసింహస్వామిని గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం సాయమారాధన, ద్వారతోరణపూజ, చతుఃస్థానార్చన, లక్ష్మీనరసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హవనం చేసి నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటచార్యులు, సురేంద్రచార్యులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, అర్చకులు, పారాయణీకులు, ఆలయ అఽధికారులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
పాతగుట్ట ఆలయంలో..
పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సైతం జయంత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం యాగశాలలో ద్వార తోరణ పూజ, మూర్తి కుంభారాధన, లక్ష్మీనృసింహ సుదర్శన గరుడ మూలమంత్ర హోమం, నిత్య పూర్ణాహుతి, లక్ష కుంకుమార్చన పూజలు జరిపించారు. సాయంత్రం సాయమారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం, నిత్య పూర్ణాహుతిని నిర్వహించారు.
భజన, కూచిపూడి నృత్య ప్రదర్శన..
ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. మంగళవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహిళ భజన మండలి, భాగ్యలక్ష్మీ మహిళా భజన మండలి ఆధ్వర్యంలో భజన నిర్వహించారు. సాయంత్రం వనజా ఉదయ్ బృందం, చింతా రవి బాలకృష్ణ బృందం కూచిపూడి, యక్షగానం ప్రదర్శన ఇచ్చారు.
ఫ భక్తులకు దర్శనమిచ్చిన నృసింహుడు
ఫ యాదగిరిగుట్టలో
కొనసాగుతున్న జయంత్యోత్సవాలు


