చిలుకూరు : బైక్‌పై వెళ్తున్న వ్యక్తి గేదెలు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చిలుకూరు మండలం బేతవోలు రోడ్డులో కరక్కాయలగూడెం గ్రామ స్టేజీ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. కొండాపురం గ్రామానికి శ్రీరాం ప్రదీప్ బైక్‌పై చిలుకూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలో బేతవోలు రోడ్డులో గేదెలను ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని 108 వాహనంలో కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రదీప్ మునగాల మండలం మండల పరిషత్ కార్యాయలంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
కృష్ణా నదిలో ఈతకు వెళ్లి బాలుడు మృతి
తిరుమలగిరి(సాగర్): స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు కృష్ణా నదిలో మునిగి మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి(సాగర్) మండలం నాయకునితండా సమీపంలో మంగళవారం జరిగింది. బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాయకునితండాకు చెందిన మేరావత్ బాలసైదా, సాల దంపతులకు కుమారుడు శోభన్(10), కుమార్తె సంతానం. శోభన్ ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి తండా సమీపంలోని కృష్ణా నది వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు నదిలోకి దిగగా.. ఈత రాక నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు కేకలు వేయగా సమీపంలో చేపలు పడుతున్న మత్స్యకారులు వచ్చి శోభన్‌ను నదిలో నుంచి బయటకు తీయగా.. అప్పటికే మృతిచెందాడు.
తాటిచెట్టుపై పడిన పిడుగు
పెద్దవూర : మండలంలో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో జల్లులు కురిశాయి. ముసలమ్మచెట్టు గ్రామ స్టేజీ వద్ద కత్తి గోవిందరెడ్డి ఇంటి పక్కన తాటిచెట్టుపై పిడుగు పడింది. దీంతో తాటిచెట్టు కాలిపోయి గోవిందరెడ్డి ఇంట్లోని గొర్రెల దొడ్డిపై పడి మంటలు లేచాయి. ఆ సమయంలో గొర్రెలు మేతకు వెళ్లి ఇంటికి రాకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్రామస్తులు బిందెలతో నీటిని పోసి మంటలను ఆర్పివేశారు.


