గరిడేపల్లి : నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి భూసార పరీక్షల ఆధారంగా మాత్రమే రైతులు ఎరువులు వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుకుమార్, శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో వారు పాల్గొని రైతులకు సాగు పద్ధతుల గురించి పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్‌లో అధిక దిగుబడి ఇచ్చే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన సన్న రకం వరి వంగడాలను సాగు చేసుకోవాలని సూచించారు. రైతులు ఒకే రకమైన పంటను వేయకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు సాగు చేయాలని అన్నారు. పచ్చిరొట్ట సాగు ద్వారా నేల సారాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు. సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రీతమ్‌కుమార్, విస్తరణాధికారులు హిమబిందు, త్రివేణి, శారద, రైతులు చంద్రారెడ్డి, కాకునూరి వెంకట్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అఖిల్, కృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.


