కట్టంగూర్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంగ్రెస్ నాయకులు దళారుల అవతారం ఎత్తి రైతులను దోచుకుంటున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్‌ఎస్ నేతలు, రైతులతో కలసి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను అధికారులు కాకుండా కాంగ్రెస్ నాయకులు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో క్వింటాల్‌కు ఆరు నుంచి ఏడు కిలోల ధాన్యం కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇరవై రోజుల క్రితం రైతులు ధాన్యం తీసుకొస్తే ఇప్పటికీ కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కాంగ్రెస్ నేతల దోపిడీని అరికట్టడంతో పాటు కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ తరాల బలరాం, అయిటిపాముల సర్పంచ్ బెల్లి సుధాకర్, నాయకులు వడ్డె సైదిరెడ్డి, నల్లమల్ల సైదులు తదితరులు ఉన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


