కుక్కలకు కుటుంబ నియంత్రణ
ఆపరేషన్ చేయిస్తున్నాం
ఏడాది కాలంలో ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, బీబీనగర్, సంస్థాన్‌నారాయణపురం, మోత్కూరు మండలాల్లో కుక్కలదాడిలో 300 మూగజీవాలు మృత్యువాత పడగా 17 గాయాలపాలయ్యాయి.
సాక్షి, యాదాద్రి : వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా శునకాలు గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవైపు పసిపిల్లలు, పాదచారులపై దాడులు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతుండగా, మరోవైపు మందల్లోని గొర్రెలను వేటాడుతూ కాపరుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో ఏడాదికాలంలో వందలాది మందిపై దాడి చేసి గాయపరిచాయి. అధికారులు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ చర్యలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భయంకరంగానే ఉంది.
మార్చిలోనే 708 మందిపై..
జిల్లా వ్యాప్తంగా 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 30వేల కుక్కలు ఉన్నట్లు అంచనా. ఈ
సంఖ్య రోజురోజుకూ
పెరుగుతుండడం
ఆందోళన కలిగిస్తోంది. ఒక్క మార్చినెలలోనే జిల్లాలో 708మంది కుక్కకాటు బాధితులు వాక్సిన్ తీసుకున్నారు. అత్యధికంగా చౌటుప్పల్ సీహెచ్‌సీ పరిధిలో 108, బొమ్మలరామారంలో 110, భువనగిరిలో 54, యాదగిరిగుట్టలో 49, రామన్నపేటలో 40,బీబీనగర్‌లో 31 మంది టీకాలు తీసుకున్నారు.
మున్సిపాలిటీల్లోనూ..
● యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 580 కుక్కలు ఉన్నాయి. సుమారు 263 కుక్కలకు భువనగిరిలో సంతాన నిరోధక ఆపరేషన్లు చేయించారు. ఈ ఏడాది 210 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.
● ఆలేరు మున్సిపాలిటీలో సుమారు 600 వరకు వీధి కుక్కలు ఉన్నాయి. ఏడాది కాలంగా 59 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. ఇటీవలనే మున్సిపాలిటీలోని వివిధ వార్డుల్లో వీధి కుక్కలను పట్టుకొని భువనగిరిలో సంతాన నిరోధక ఆపరేషన్లు చేయించారు.
● చౌటుప్పల్ మున్సిపాలిటీలో పరిధిలో ఎక్కడ చూసినా శునకాలు గుంపులుగా సంచరిస్తున్నాయి. చిన్న పిల్లలతో పాటు మేకలు, కోళ్లపై దాడి చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం చౌటుప్పల్‌లో కుక్కలను పట్టించే కార్యక్రమాన్ని చేపట్టారు. చౌటుప్పల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిధిలో 260 వరకు కుక్కకాటు కేసులు నమోదు అయ్యాయి.
● మోత్కూర్ మున్సిపాలిటీలో సుమారు 400 వరకు కుక్కలు ఉన్నాయి. ఈ ఏడాది478 కుక్క కాటు కేసులు నమోదు అయ్యాయి.
భువనగిరి మున్సిపాలిటీలో సుమారు 3 వేల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేయగా, ఇప్పటివరకు వీటిలో 2,000కు పైగా కుక్కలను పట్టుకొని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలకు తరలించారు. మున్సిపాలిటీలో సుమారు 450కి పైగా పెంపుడు కుక్కలు ఉన్నట్లు గుర్తించారు.
● భూదాన్ పోచంపల్లిలో రాత్రి వేళలో రోడ్డు వెంట వెళ్లే ద్విచక్ర వాహనదారులను వెంటబడుతుండటంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి ఇటీవల ఒకరిద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పట్టణంలో సుమారు 500 వరకు కుక్కలు ఉండొచ్చని అంచనా. పోచంపల్లి మున్సిపల్ పాలకవర్గం కౌన్సిల్ మొదటి సమావేశంలో కుక్కల నివారణపై తీర్మానం చేసింది.
వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో 2,500 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించాం. భువనగిరిలోని హన్మాపురం, నల్లగొండలో జిల్లాలో గల కుక్కలకు నిరంతరం యానిమల్ బర్త్ కంట్రోల్ చేస్తున్నాం. నిబంధనల మేరకు ఊరకుక్కలకు ఆపరేషన్ చేసి నాలుగు రోజుల తర్వాత గాయం మానగానే వాటి స్వస్థలాల్లో వదిలేస్తున్నాం.
– భాస్కర్‌రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్
భువనగిరి పట్టణంలో వీధి కుక్క కాటుకు నాలుగేళ్ల బాలుడు కన్ను కోల్పోయాడు. సందెల శ్రావణి, రాహుల్ దంపతుల కుమారుడు ప్రియాంష్ ఇంటి వద్ద ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేయడంతో చెంప, కన్ను కోల్పోయాడు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చేర్పించగా ప్రాణాలు దక్కాయి. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ కన్ను అమర్చడానికి వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.


