ఫార్మర్‌ రిజిస్ట్రీకి నాలుగు రోజులే | - | Sakshi
Sakshi News home page

ఫార్మర్‌ రిజిస్ట్రీకి నాలుగు రోజులే

Apr 27 2026 8:48 AM | Updated on Apr 27 2026 8:48 AM

విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు

సాక్షి యాదాద్రి : రైతు భరోసా, పీఎం కిసాన్‌ వంటి పథకాలు అందాలన్నా.. భవిష్యత్తులో ఎరువులు, విత్తనాలు పొందాలన్నా ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఈ నెల 30వ తేదీనే ఆఖరి గడువుగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా 64శాతం మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో, జిల్లాలోని సుమారు 97 వేల మందికి పైగా రైతులు ఆందోళనలో ఉన్నారు. గడువు ముగిసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ ఐడీ లేకపోతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మండలాల వారీగా ఇలా:

జిల్లా వ్యాప్తంగా మండలాల వారీగా పరిస్థితిని పరిశీలిస్తే.. వలిగొండ మండలంలో 25,091 మంది రైతులకు గాను 19,026 మంది నమోదు పూర్తి చేసుకుని 75.83 శాతంతో జిల్లాలోనే ముందు వరుసలో నిలిచింది. నారాయణపూర్‌ మండలంలో 17,958 మందికి 12,859 (71.61శాతం), మోత్కూర్‌ మండలంలో 9,517 మందికి 6,680 (70.19శాతం), బి. పోచంపల్లి మండలంలో 15,695 మందికి 10,961 (69.84శాతం), మోటకొండూరు మండలంలో 11,701 మందికి 7,913 (67.63శాతం), అడ్డగూడూరు మండలంలో 11,537 మందికి 7,718 (66.90శాతం) మంది రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. రామన్నపేట మండలంలో 17,431 మందికి 11,274 (64.68శాతం), గుండాల మండలంలో 14,906 మందికి 9,585 (64.30శాతం), రాజాపేట మండలంలో 16,802 మందికి 10,733 (63.88శాతం), భువనగిరి మండలంలో 21,490 మందికి 13,602 (63.29శాతం), ఆత్మకూరు (ఎం) మండలంలో 14,661 మందికి 9,253 (63.11శాతం), బీబీనగర్‌ మండలంలో 13,468 మందికి 8,177 (60.71శాతం) మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు. మరికొన్ని మండలాల్లో ఈ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. తుర్కపల్లి మండలంలో 18,485 మందికి 11,043 (59.74శాతం), ఆలేరు మండలంలో 14,427 మందికి 8,576 (59.44శాతం), చౌటుప్పల్‌ మండలంలో 19,070 మందికి 11,308 (59.30శాతం), బొమ్మలరామారం మండలంలో 16,222 మందికి 9,306 (57.37శాతం) మాత్రమే పూర్తయ్యాయి. ఇక యాదగిరిగుట్ట మండలంలో 13,333 మందికి గాను కేవలం 6,532 (48.99శాతం) మంది మాత్రమే నమోదు చేసుకుని జిల్లాలోనే అత్యల్ప శాతంతో వెనుకబడి ఉంది. జిల్లా మొత్తం మీద ఇప్పటివరకు 1,74,546 మంది (64.21శాతం) నమోదు పూర్తి చేయగా, ఇంకా 97,248 మంది రైతులు గడువులోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంది.

ఫ 30తో ముగియనున్న ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ గడువు

ఫ ఇప్పటి వరకు నమోదు చేసుకున్నది 64శాతం మంది రైతులే

ఫ నమోదు చేసుకోకపోతే పీఎం కిసాన్‌, రైతు భరోసా బంద్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమగ్ర వివరాల సేకరణ కోసం ఉద్దేశించిన ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియ 2025 మే 6వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ బాధ్యతను చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా ప్రతి రైతుకు ఆధార్‌ తరహాలో 11 అంకెలతో కూడిన ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. భవిష్యత్తులో పీఎం కిసాన్‌, పంట బీమా వంటి పథకాల లబ్ధి నేరుగా రైతులకే అందేలా చూడటం, వ్యవసాయ రంగానికి సంబంధించిన గణాంకాలను డిజిటలైజ్‌ చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓలు) తమ పరిధిలోని రైతుల పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement