ఎర్రవరం పీఏసీఎస్‌లో ఎరువులు మాయం | - | Sakshi
Sakshi News home page

ఎర్రవరం పీఏసీఎస్‌లో ఎరువులు మాయం

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

గతంలోనూ సస్పెండ్‌

కోదాడరూరల్‌ : కోదాడ మండల పరిధిలోని ఎర్రవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్‌)లో పనిచేస్తున్న ఉద్యోగి సీఈఓ, ఇతర సిబ్బందికి తెలియకుండా రూ.7.30లక్షల విలువైన ఎరువులను విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీఈఓ, సిబ్బంది ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వడంతో ఎరువులు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎర్రవరం పీఏసీఎస్‌ కార్యాలయంలో స్టాఫ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పాముల వెంకటేశ్వర్లు ఎరువుల విక్రయ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు. అయితే సంఘానికి వచ్చే రూ.7.30లక్షల విలువైన యూరియా, 20–20–013, డీఏపీ, పొటాష్‌ వంటి ఎరువులను వెంకటేశ్వర్లు గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకొని ఆ డబ్బులును తన సొంతానికి వాడుకున్నాడు. మార్చి నెలలో సీఈఓ మౌలాలి, సిబ్బంది అంతా కలిసి ఎరువుల స్టాక్‌, రికార్డులను పరిశీలిస్తుండగా మొదట రూ.2,99,166 విలువైన ఎరువుల డబ్బులు జమ కానట్లు గుర్తించారు. ఎరువులు ఎవరికి విక్రయించావు, డబ్బులు ఎందుకు జమ చేయలేదని వెంకటేశ్వర్లును ప్రశ్నించగా పొంతన లేని సమాధాలు చెప్పాడు. దీంతో సీఈఓ ఈ విషయాన్ని సంఘం స్పెషల్‌ ఆఫీసర్‌ పద్మజకు తెలియజేశారు. ఆమె వెంకటేశ్వర్లుకు అందాల్సిన మార్చి నెల వేతనాన్ని నిలిపివేసి ఈ నెల 16న విచారణ చేపట్టారు. ఈ విచారణలో తానే ఎరువులను విక్రయించానని వెంకటేశ్వర్లు ఒప్పుకొని, ఆ నగదును తిరిగి సంఘానికి చెల్లించాడు.

రికార్డుల పరిశీలనలో అనుమానం వచ్చి..

అయితే వెంకటేశ్వర్లుపై అనుమానం వచ్చిన సిబ్బంది పాత ఎరువుల స్టాక్‌, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలిచారు. వాటిలో పలు చోట్ల కొట్టివేతలు ఉండటం, కొందరికి ఎక్కువ మొత్తంలో ఎరువులు విక్రయించినట్లు ఉండటంతో రెండు రోజుల కిందట పీఏపీఎస్‌, వ్యవసాయాధికారులు కలిసి పాత రికార్డులను కూడా తీసి లెక్కలు చూశారు. ఆ లెక్కల్లో రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి రూ.2,99,166 విలువైన ఎరువులే కాకుండా మరో రూ.4.30లక్షల విలువైన ఎరువులను కూడా అతడు విక్రయించి డబ్బులు సంఘంలో జమ చేయలేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంకటేశ్వర్లును ప్రశ్నించగా.. తన తప్పును ఒప్పుకొని శుక్రవారం రూ.2.50లక్షల నగదను సంఘానికి కట్టాడు. ఆ తర్వాత సిబ్బంది ఈ విషయాన్ని డీసీఓకు తెలియజేయడంతో అతడిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు.

సస్పెండ్‌ చేశాం..

ఎరువులు విక్రయించి నగదును సంఘంలో జమ చేయని స్టాఫ్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లును డీసీఓ విధుల నుంచి సస్పెండ్‌ చేశారని పీఏసీఎస్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ పద్మజ తెలిపారు. అతడు వాడుకున్న నగదులో కొంతమేర రికవరీ చేశామని, మిగిలిన వాటి కోసం నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విచారణ ఇంకా జరగుతుందని, సోమవారం నాటికి విచారణ పూర్తిచేసి పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

వెంకటేశ్వర్లు గతంలోనూ రైతు రుణమాఫీ విషయంలో ఆరు నెలల పాటు సస్పెండ్‌ అయ్యాడు. పీఏసీఎస్‌లలో పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను ప్రభుత్వం పంపమన్నప్పుడు అతడు అర్హులైన 66మంది రైతుల పేర్లను పంపించలేదు. దీంతో వారికి రుణమాఫీ కాకపోవడంతో రైతులు సంఘం కార్యాలయం ఎదుట ఆందోళనలు, ధర్నాలు చేశారు. ఆ సమయంలో విచారణ చేసిన అధికారులు రైతుల పేర్లు పంపించడంలో నిర్లక్ష్యం చేసిన కారణంగానే రుణమాఫీ కాలేదని గుర్తించి వెంకటేశ్వర్లును విధుల నుంచి సస్పెండ్‌ చేశారు.

ఫ రూ.7.30లక్షల విలువైన

ఎరువులను విక్రయించి నగదును వాడుకున్న ఉద్యోగి

ఫ మార్చిలో విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన సీఈఓ, సిబ్బంది

ఫ రూ.5,49,166 రికవరీ చేసిన అధికారులు

ఫ సదరు ఉద్యోగిని విధుల్లో నుంచి సస్పెండ్‌ చేసిన డీసీఓ

Advertisement
 
Advertisement
Advertisement