రైతు వేషధారణలో అవగాహన | - | Sakshi
Sakshi News home page

రైతు వేషధారణలో అవగాహన

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్‌ శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో రైతు వేషధారణలో నో డ్రగ్స్‌–సేవ్‌ లైఫ్‌ కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రభాకర్‌ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలు,గంజాయికి దూరంగా ఉండి తమను తాము రక్షించుకోవాలని అన్నారు. రైతులు పంట పొలాల్లో రసాయన మందులు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్‌ ధరించాలన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

పలువురికి గాయాలు

మద్దిరాల : చెట్టును ఢీకొని టాటా ఏస్‌ వాహనం బోల్తా పడడంతో ఇద్దరు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మద్ది రాల మండలం చిన్ననెమిల గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలి పిన వివరాల ప్రకారం.. చిన్ననెమిల గ్రామానికి చెందిన సూరారపు శంకర్‌ జీవనోపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్లాడు. ఈ నెల 28న స్వగ్రామంలో ఎల్లమ్మ పండుగ చేసేందుకు గాను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి హైదరాబాద్‌ నుంచి టాటా ఏస్‌ వాహనంలో వస్తుండగా.. శనివారం తెల్లవారుజామున చిన్ననెమిల గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్‌ అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టడంతో టాటా ఏస్‌ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శంకర్‌ బంధువైన తిరుమలగిరి మండలం జలాల్‌పురం గ్రామానికి చెందిన కొమ్ము బాబు(18) అక్కడికక్కడే మృతిచెందాడు. శంకర్‌ భార్య రాధ(30) తీవ్రంగా గాయపడడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మరో ముగ్గురు నందిని, పవన్‌, పాపయ్యకు గాయాలయ్యాయి. సూరారపు శంకర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎం. వీరన్న తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్ప ప్రసన్నకుమార్‌ పరిశీలించారు.

మిషన్‌లో చేతులు పడి వ్యక్తి మృతి

మోత్కూరు : పరుపు తయారు చేసేందుకు పత్తి ఒడుకుతుండగా.. ప్రమాదవశాత్తు చేతులు మిషన్‌లో పడి వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మోత్కూరు పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు పట్టణానికి చెందిన ఎండీ ఇస్మాయిల్‌ (55) షరీఫ్‌ స్థానికంగా బెడ్‌ వర్క్స్‌, ఫర్నీచర్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం పరుపు తయారు చేసేందుకు పత్తిని ఒడికే సమయంలో అతడి చేతులు మిషన్‌లో ఇరుక్కుని తెగిపోయాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఇస్మాయిల్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య జాన్‌బీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement