పేద కుటుంబానికి రూ.4,05,081 ఆర్థికసాయం | - | Sakshi
Sakshi News home page

పేద కుటుంబానికి రూ.4,05,081 ఆర్థికసాయం

Apr 27 2026 7:18 AM | Updated on Apr 27 2026 7:18 AM

గరిడేపల్లి : ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి గ్రామస్తులంతా కలిసి అండగా నిలిచారు. గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన షేక్‌ యూసుఫ్‌ ఇటీవల మృతిచెందాడు. ఆయన ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడి భవిష్యత్తు అంధకారం కాకూడదని గ్రామస్తులంతా కలిసి రూ.4,05,081 విరాళాలు సేకరించి ఆ మొత్తాన్ని శనివారం చిన్నారుల పేరిట పోస్టాఫీస్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబానికి గ్రామస్తులు అందించిన సాయం స్ఫూర్తిదాయకం.

ఏటీఎం దొంగలు..

కారు వదిలి పరార్‌

ఆంధ్రప్రదేశ్‌లో చోరీకి పాల్పడిన ముఠా

చిట్యాల : ఏటీఎంలలో నగదు చోరీ చేసిన దొంగలు కారులో హైదరాబాద్‌కు వెళ్తూ పోలీసులను చూసి కారును వెంచర్‌లో వదిలి డబ్బుతో పరారయ్యారు. ఈ ఘటన చిట్యాల పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఏటీఎంలలో నగదు చోరీ చేసిన ముఠా సభ్యులు శనివారం కారులో హైదరాబాద్‌ వైపు వెళ్తుండగా.. చిట్యాల పట్టణంలో రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారిలో విజయవాడ–హైదరాబాద్‌ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. పోలీసులను గమనించిన ముఠా సభ్యులు కారును పక్కనే ఉన్న వేణుగోపాలస్వామి వెంచర్‌లోకి మళ్లించి అక్కడే ఓ ఇంటి ముందు నిలిపి డబ్బుతో పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ రవికుమార్‌ తన సిబ్బందితో వెళ్లి కారును తనిఖీ చేయగా అందులో కొన్ని దుస్తులు తప్ప ఏమీ లభించలేదు. నలుగురు దొంగలు పరారు కాగా.. వారి వద్ద ఏటీఎంలలో చోరీ చేసిన డబ్బు ఉన్నట్లు తెలుస్తోంది. పరారైన దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

చెరువులో వ్యక్తి

మృతదేహం లభ్యం

భువనగిరి(బీబీనగర్‌) : బీబీనగర్‌ పెద్ద చెరువులో శనివారం వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్‌కు చెందిన సతి గంగాధర్‌రెడ్డి(33) శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో అతడి భార్య విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం మధ్యాహ్నం బీబీనగర్‌ చెరువు కట్ట వద్ద గంగాధర్‌రెడ్డి బైక్‌ ఉన్నట్లు సమాచారం రావడంతో అతడి భార్య అక్కడికి వెళ్లి చూసి.. ఆ బైక్‌ తన భర్తదే అని గుర్తించింది. చెరువులోకి చూడగా నీటిలో గంగాధర్‌రెడ్డి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. పోలీసులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు వెలికితీశారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement