చివ్వెంల(సూర్యాపేట) : కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంపుల గ్రామానికి చెందిన పిట్ట సత్తిరెడ్డి (55) బైక్‌పై వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. గ్రామ శివారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్తిరెడ్డికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
వడదెబ్బతో కూలీ..
అర్వపల్లి : వడదెబ్బతో అస్వస్థతకు గురై కూలీ మృతిచెందాడు. అర్వపల్లికి చెందిన మామిడి నర్సింహ(45) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సుతారి పనికి వెళ్లిన నర్సింహ వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురై శనివారం మృతిచెందాడు. మృతుడు నిరుపేద కావడంతో స్థానికులు చందాలు వేసుకొని దహన సంస్కారాలు చేశారు.
అనుమానాస్పద స్థితిలో బాలుడు..
హుజూర్‌నగర్: పట్టణా నికి చెందిన బాలుడు ఇంట్లో అనుమానాస్పద స్థితి లో మృతిచెందాడు. బంధువులు, స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. హుజూర్‌నర్‌కు చెందిన లింగం పెదకాశయ్య కుమార్తె విజయను ఏపీలోని విజయవాడ సమీపంలో గల ఇబ్రహీంపట్నంకు చెందిన కన్నెబోయిన కోటేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు సంతానం. కుటుంబ కలహాల కారణంగా పదేళ్ల క్రితమే విజయ తన కుమారుడు కార్తీక్(13)తో వచ్చి హుజూర్‌నగర్‌లోనే ఉంటోంది. ఇటీవల కోటేశ్వరరావు హుజూర్‌నగర్ వచ్చి భార్యాపిల్లలతో కలిసి ఉంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. విజయ కూడా కూలీ పనికి వెళ్తోంది. కాగా శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కార్తీక్ ఉరేసుకున్నాడని కోటేశ్వరరావు భార్యకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కార్తీక్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి మేనమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌బాబు తెలిపారు.


