భానుపురి (సూర్యాపేట) : అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. లబ్ధిదారులు తీవ్ర నిరాశలో ఉన్నారని, కేసీఆర్ ఇచ్చిన రూ.లక్ష తప్ప తులం బంగారం ఎప్పుడిస్తారని ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆర్టీసీ సమ్మెకు పోయిందంటే అది కాంగ్రెస్ పాపమేనని, కార్మికుల ఆత్మహత్యలకు ఆ పార్టీ బాధ్యత వహించాలన్నారు. వడ్లు, మొక్కజొన్నల కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వం జాప్యం చేయడం సరికాదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలన్నారు. అకాల వర్షాలు పడకముందే ధాన్యం కొనుగోల్లు పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కంటే ముందున్న రోజులే మళ్లీ దాపురించాయని, మంచినీళ్ల విషయంలోనూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ కోతలు విపరీతంగా ఉన్నాయని, ఇకనైనా మేలుకొని హామీల అమలుపై, అభివృద్ధిపై కాంగ్రెస్ పాలకులు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


