గరిడేపల్లి: రైతులు ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని జాతీయ మొక్కల ఆరోగ్య పరిరక్షణ సంస్థ జాయింట్ డైరెక్టర్ మరియాదాస్ తెలిపారు. గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం వేర్ హౌసింగ్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ యాక్ట్, నెగోషియబుల్ వేర్ హౌస్‌లపై రైతులు, వ్యాపారులు, పప్పు మిల్లు యజమానులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వ సమయంలో ఉపయోగించే హెల్మెట్రిక్ బ్యాగుల ఉపయోగాలపై రైతులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. సరైన జాగ్రత్తలు పాటించకుంటే 30 శాతం వరకు ధాన్యం నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. ధాన్యం నిల్వపై రైతులందరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. కేవీకే సస్యరక్షణ శాస్త్ర వేత్త ఆదర్శ్ మాట్లాడుతూ.. ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసుకోవడమే కాకుండా నిల్వ చేసిన ధాన్యానికి రుణ సదుపాయం తీసుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ఈ రిసిప్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో రైతులు ధాన్యాన్ని అమ్ముకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు ఆదర్శ్, కిరణ్, అక్షిత సాయి, సుగంధి, రైతులు పాల్గొన్నారు.


