సహకార ఎన్నికలకు స్వస్తి! | - | Sakshi
Sakshi News home page

సహకార ఎన్నికలకు స్వస్తి!

Apr 25 2026 7:12 AM | Updated on Apr 25 2026 7:12 AM

విలీన సంఘాలను పునరుద్ధరించాలి

కోదాడ: సహకార సంఘాల్లో చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, డైరెక్టర్లు కావాలనుకుంటున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని, నామినేటెడ్‌ బాడీని ఏర్పాటు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో సహకార సంఘాల ఎన్నికలకు స్వస్తి పలికినట్లు అయింది. ప్రతి సహకార సంఘంలో ఇద్దరిని ప్రభుత్వం నామినేటెడ్‌ చేస్తుందని, వీరికి సహకారం అందించడానికి ప్రతి సంఘంలో ఒక సీఈఓ ఉంటాడని, ఈ ముగ్గురితోనే సంఘ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని సమాచారం. నామినేటెడ్‌ పదవుల ఎంపికలో ఎమ్మెల్యేల నిర్ణయమే కీలకం కావడంతో పలువురు ఆశావహులు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.

ఉమ్మడి జిల్లాలో 107 సహకార సంఘాలు

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 107 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. వీటికి 2020లో ఎన్నికలు నిర్వహించి నూతనపాలక వర్గాలు ఏర్పాటు చేశారు. ప్రతి సంఘంలో 13 మంది డైరెక్టర్లు ఉండేవారు. వీరిని ఆ సంఘంలో సభ్యత్వం ఉన్న రైతులు ఎన్నుకునేవారు. ఈ డైరెక్టర్లు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లను ఎన్నుకునేవారు. వీటి కాలపరిమితి గతేడాది ఫిబ్రవరి 15న ముగిసింది. అయితే వెంటనే ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం పాలకవర్గాల పదవీ కాలాన్ని మొదట ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ గడువు ఆగస్టు 2025తో ముగుస్తుందనగా మరో ఆరునెలలు ఫిబ్రవరి 2026 వరకు పొడిగించింది. కానీ డిసెంబర్‌లోనే పాలకవర్గాలను రద్దు చేసి ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఆశావహులు ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తుండగా ప్రభుత్వం గురువారం ఆకస్మికంగా ఎన్నికలు లేదని, నామినేటెడ్‌ విధానం ద్వారానే నియమాకాలు చేపడతామని ప్రకటించడంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

సంఘానికి ఇద్దరా, నలుగురా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా ఇద్దరు సభ్యులను నామినేటెడ్‌ చేసి ఒక అధికారిని నియమించి ముగ్గురుతోనే సంఘాలను నడుపుతుంది. ఈ విధానాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇక్కడ కూడా అదే విధానం అమలు చేస్తే బావుంటుందని ప్రభుత్వానికి నివేదించడంతో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలను రద్దు చేస్తూ నామినేటెడ్‌ విధానంలో పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి సంఘంలో ఇద్దరిని నామినేటెడ్‌ చేయాలా? లేక నలుగురిని నామినేటెడ్‌ చేయాలా? అనే విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వీరికి సాయంగా ప్రతి సంఘంలో ఒక అధికారిని నియమించనున్నారు. దీనిపై స్పష్టత రాగానే దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

అగమ్యగోచరంగా విలీన సంఘాల పరిస్థితి

గతంలో ప్రతి మండలంలో ఒకటికన్నా ఎక్కువ సహకార సంఘాలుండేవి. వీటి పనితీరు బాగాలేక అనేక సంఘాలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ క్రమంలో నాలుగైదు సంఘాలను సమీపంలో ఉన్న ఒక సంఘంలో కలిపారు. ప్రస్తుతం నామినేటెడ్‌ విధానంలో పాలకవర్గాలను ఏర్పాటు చేస్తున్నందున తమ సంఘాలను పునరుద్ధరించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ నీరుగారిపోయిన ఆశలు

ఫ నామినేటెడ్‌ విధానంలోనే నియామకాలు

ఫ ఉమ్మడి జిల్లాలో 107 సహకార సంఘాలు

ఫ ఇక ప్రతిసంఘంలో ఇద్దరికే అవకాశం

ఫ ఇద్దరు నాయకులు, ఒక అఽధికారికి

నిర్వహణ బాధ్యతలు

గతంలో ఇతర సంఘాల్లో విలీనం చేసిన సంఘాలను మళ్లీ పునరుద్ధరించాలి. దీంతో పాటు ప్రతి సంఘంలో ఇద్దరు కాకుండా నలుగురిని నామినేటెడ్‌ చేయాలి. గతంలో ఒక్క కోదాడ సంఘంలో 8 సహకార సంఘాలను విలీనం చేశారు. జిల్లాలో ఇలా విలీనం చేసిన వాటిని పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుంది.

– ఓరుగంటి శ్రీనివాసరెడ్డి,

కోదాడ పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement