గోమయం, పంచగవ్వ, జీవామృతం వంటి జీవ ఎరువులను వినియోగించి భూసారం కాపాడుకోవచ్చు. పంటలకు పోషకాలు అందించి మట్టిని ఆరోగ్యంగా ఉండే విధంగా చూస్తాయి. పంటలు ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడతాయి. మట్టిలో సేంద్రియ పదార్థాలను పెంచి పైర్ల గాలితో పాటు నీటి నిల్వ సామర్థ్యాలను పెంచుతాయి. పంటలకు నెమ్మదిగా నిరంతర పోషకాలను అందిస్తాయి. సహజ సిద్ధమైనవి కాబట్టి పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు.
త్రిపురారం : చీడపీడల నివారణకు రసాయన ఎరువులు విపరీతంగా వినియోగిస్తున్నారు. దీంతో నేల నిస్సారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు ముంగిటల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో కేవీకే వ్యవసాయ శాస్త్రవేత్తలు, వరి పరిశోధన శాస్త్రవేత్తలు రైతులతో సమావేశాలు నిర్వహించి రసాయని ఎరువుల వాడకాన్ని తగ్గించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. నేలలను సారవంతంగా మార్చుకోవడానికి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ రైతులకు పలు సూచనలు చేశారు.
గొర్రెల మందలతో అధిక ప్రయోజనాలు
పొలాల్లోని నేలలను సారవంతంగా చేసుకోవడానికి గొర్రెల ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం పంట కోతలు ముగిసి పొలాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇతర ప్రాంతాల నుంచి గొర్రెలు మేత కోసం ఇక్కడి వస్తుంటాయి. ఒక్కో గొర్రెల మందలో సుమారు 150 నుంచి 500 గొర్రెల వరకు ఉంటాయి. ఈ గొర్రెల మందలను రాత్రి సమయంలో పొలంలో ఉండే విధంగా చూసుకోవాలి. అలా గొర్రెల పెంటికలను నేలలో కలియ దున్ని దమ్ము చేసుకుంటే నేల సారవంతంగా మారుతుంది.
వర్మికంపోస్టుతో నేల సారవంతం
వర్మికంపోస్టు నిస్సారమైన భూమిని సారవంతంగా మారుస్తుంది. రసాయన ఎరువుల ద్వారా భూమిలో ఇంకిపోయిన భాస్వరం, పొటాషియం, నత్రజని తిరిగి పంటలకు ఉపయోగపడేలా చేస్తుంది. పంటలకు కావాల్సిన హర్మోన్లు విటమిన్లు, సూక్షపోషకాలు, మద్య పోషకాలు, జింక్ పూర్తి స్థాయిలో లభిస్తుంది. పైర్లకు చీడపీడలను తట్టుకునే శక్తిని ఇస్తుంది. వర్మికంపోస్టు ద్వారా పండించిన పంట ఆరోగ్యకరంగా నాణ్యతగా ఉంటుంది. మార్కెట్‌లో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఈ ఎరువులో తేమ శాతం ఎక్కుంగా ఉండడం వల్ల నీటి వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఎకరానికి 500 కేజీల వర్మికంపోస్టు వేసుకోవడం ఉత్తమం.
తయారీ విధానం
వర్మికంపోస్టు తయారీకి అవసరమైన తొట్టెలను నిర్మించుకోవాలి. వీటిలో వరి గడ్డి ఒక లేయర్‌గా వేసుకోవాలి. దీనిపై ఆరబెట్టిన పేడను ఓ మేరగా వేసుకొని దానిపై తడిచెత్తను వేసుకోవాలి. మూడు రోజులు మగ్గిన తరువాత వానపాముల సీడ్‌ను వేయాలి. అనంతరం జీవామృతం పోసుకొని స్ప్రేయర్ ద్వారా నీళ్లు చల్లుతూ ఉండాలి. 20 నుంచి 30 రోజుల్లో వానపాములు పూర్తి స్థాయిలో ఉత్పత్తి అవ్వడం ద్వారా ఒక మిశ్రమంలా మారుతుంది. పై భాగంలో ఉన్న మిశ్రమాన్ని జల్లించి ఆరబెట్టడం ద్వారా వర్మికంపోస్టు తయారవుతుంది. పై భాగంలో మిశ్రమాన్ని తీసిన ప్రతి సారి జీవామృతం పోస్తూ మగ్గపెట్టుకోవాలి. ఇలా తొట్టెల్లోని మిశ్రమాన్ని పూర్తిగా ఉపయోగించిన తరువాత తిరిగి తయారీ ప్రారంభించుకోవాలి.
పచ్చిరొట్టతో ఉపయోగాలు
పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగ, పిల్లిపెసర, ఉలవ, అలసందను ప్రధాన పంట సాగుకు ముందు సాగు చేసి కలియ దున్నుకోవాలి. సూక్ష్మ జీవులు విస్తారంగా వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. భూమి గుల్లబారి నీటి నిలువ శాతం పెరిగి సులభంగా నీరు, గాలి వేర్లకు అందుతుంది. పచ్చిరొట్ట పైర్లు భూమిలో కుళ్లేటప్పుడు రసాయనిక ప్రక్రియలు జరిగి మొక్కలకు పోషక పదార్థాలు అందుతాయి.
ఫ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
ఫ పంటల సాగులో కేవీకే ప్రోగ్రాం
కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు


