యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించిన వైకుంఠద్వారం ముందున్న ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డు అధికారులు శుక్రవారం తొలగించారు. పట్టణంలోని వైకుంఠద్వారం ముందు ప్రధాన రహదారికి ఆనుకొని సుమారు రూ.60 లక్షల విలవు చేసే 60 గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో చలివేంద్రం ఏర్పాటు చేయాలని మొదట మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. విషయం తెలిసిన దేవస్థానం అధికారులు తమ అనుమతి లేకుండా చలివేంద్రం ఏర్పాటు చేయొద్దని నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ గుర్తుతెలియని వ్యక్తులు రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు.
బీజేపీ నాయకుల ఫిర్యాదుతో తొలగింపు
ఈ నెల 23న సాయంత్రం సదరు ఖాళీ స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు షెడ్డు ఏర్పాటు చేశారు. దీంతో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్, తమ నాయకులతో కలిసి శుక్రవారం షెడ్డు వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. దేవస్థానం అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో దేవస్థానం డిప్యూటీ ఈఓ నవీన్‌కుమార్ తన సిబ్బందితో అక్కడికి వచ్చి అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్డును తమ సిబ్బందితో తొలగింపజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈ స్థలాన్ని అధికార పార్టీ అండతో ఆక్రమించేందుకే కొందరు షెడ్డు వేశారని, సీసీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఈఓకు విన్నవించారు. ఇదే విషయమై యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి వివరణ కోరగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఖాళీ స్థలంలో తాము ఎలాంటి షెడ్డు ఏర్పాటు చేయలేదని తెలిపారు. దీనిపై మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ సురేందర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో భక్తుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేశామని పేర్కొనడం గమనార్హం. చలువ పందిళ్లతో చలివేంద్రం ఏర్పాటు చేస్తారు కానీ ఏకంగా రేకులతో షెడ్డు ఏర్పాటు చేయడమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు.
దేవస్థానం స్థలంలో వేసిన షెడ్డును తొలగిస్తున్న ఆలయ సిబ్బంది
దేవస్థానం డిప్యూటీ ఈఓ నవీన్‌కుమార్‌తో మాట్లాడుతున్న బీజేపీ నాయకులు
ఫ బీజేపీ నాయకుల ఆందోళనతో తొలగించిన అధికారులు
ఫ తమకు సంబంధం లేదన్న మున్సిపల్ కమిషనర్
ఫ చలివేంద్రం కోసం వేశామన్న శానిటరీ ఇన్‌స్పెక్టర్


