సాక్షి, యాదాద్రి : జిల్లాలోని పలు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం, శుక్రవారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భువనగిరి మండలం హన్మాపురంలో 6.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే తుర్కపల్లి (ఎం) మండలం మన్నేవారి తుర్కపల్లిలో 1.5 మి.మీ, భువనగిరి కలెక్టరేట్ ప్రాంతంలో 1.3 మి.మీ వర్షం కురిసింది. భువనగిరి పట్టణంలో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై సుమారు 30 నిమిషాల పాటు తేలికపాటి వర్షం కురిసింది. భువనగిరి పట్టణంలోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడం వల్ల పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యాదగిరిగుట్టలో 1.3 మి.మీ, నారాయణపూర్ మండలం జంగంలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన ఈ వర్షం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. ఈ వర్షంతో ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కలిగినా మున్ముందు వేడి తాపాన్ని మరింత పెంచుతాయని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు చెబుతున్నారు.


