సాక్షి, యాదాద్రి : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఈనెల 10 నుంచి ప్రారంభిస్తామని అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆయన తన చాంబర్‌లో మాట్లాడారు. 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులు, ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు కొత్తగా కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. తాము ధాన్యం దించుకోబోమని ఇచ్చిన వినతి పత్రంపై మిల్లర్లతో చర్చించామన్నారు. మిల్లర్లు ధాన్యం దించుకుంటారని తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
భువనగిరిటౌన్ : తమకు తెలియకుండానే మహిళా పొదుపు సంఘాల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడకు చెందిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం రోడ్డెక్కారు. పట్టణంలోని 5, 7, 18 వార్డులకు చెందిన సంఘాల్లో జరిగిన ఈ భారీ కుంభకోణంపై బాధితులు నిరసన తెలిపారు. మహిళా సంఘాల సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి, ఆర్పీలు ఒక్కో సంఘం నుంచి సుమారు రూ.20 లక్షల చొప్పున కోట్లాది రూపాయలను డ్రా చేసి సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. సంఘ సభ్యులు లేకుండానే ఆర్పీల చేతికి నిధులు ఎలా ఇస్తారని కెనరా బ్యాంక్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడ్డ ఆర్పీలతో పాటు మెప్మా అధికారులు, మున్సిపల్ అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే మంగళవారం వినాయక చౌరస్తా వద్ద పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు.


