ప్రారంభానికి సిద్ధంగా..
భువనగిరి : భువనగిరి పట్టణంలో జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు భరోసా కేంద్రం అందుబాటులోకి కానున్నాయి. రాచకొండ కమిషనరేట్ నుంచి భువనగిరి జిల్లాను ఎస్పీ స్థాయికి మార్చడంతో జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు భరోసా సెంటర్ ఏర్పాటు అనివార్యమయ్యాయి. ఈ రెండు కార్యాలయాల ఏర్పాటుతో ఇటు పోలీసులకు, అటు మహిళలు, బాధితులకు ఇబ్బందులు తొలగనున్నాయి.
జిల్లా పోలీస్ కార్యాలయం ఎక్కడంటే..
జిల్లా పోలీస్ పరిపాలన విభాగం డీపీఓ కేంద్రంగా ఉంటుంది. సుమారు రూ.20 లక్షల వ్యయంతో జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం పక్కన భువనగిరి రూరల్ పోలీస్ క్వార్టర్స్‌ను ఆధునీకరించి జిల్లా పోలీస్ అధికారి (డీపీఓ)కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంలో ఐదు విభాగాలకు సీఐ స్థాయి అధికారులను నియామించారు. డీపీఓ నాలుగు సెక్షన్లు ఉంటాయి. వీటిలో ఏ–సెక్షన్(స్టాప్ అడ్మినిస్ట్రేటివ్), బీ–సెక్షన్(బడ్జెట్), సీ–సెక్షన్(అట్రాసీట్ తదితరులు కేసులు), డి–సెక్షన్(సిబ్బంది వేతనాలు, ఐటీ నిర్వహణ, బిల్డింగ్స్). అలాగే జిల్లా పోలీస్‌కు ట్రాఫిక్, ఎస్పీ, షీ టీమ్స్, ఇంటలిజెన్సీ వంటి ఉప విభాగాలు ఉంటాయి. వీటి ద్వారా అన్నిరకాల పోలీస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
నల్లగొండ రోడ్డులో భరోసా కేంద్రం
నల్లగొండ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో భరోసా కేంద్రం నిర్మించారు. హింసకు గురైన మహిళలకు, పిల్లలకు ఆసరాగా నిలించేందుకు ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మహిళలకు న్యాయ, వైద్య, మానసిక, పోలీస్ సహాయం వంటి వాటిని ఈ కేంద్రం ద్వారా అందించనున్నారు. ఈ కేంద్రానికి షీటీమ్స్ అనుసంధానమై ఉండనుంది. తాత్కాలికంగా ఆశ్రయం ఇచ్చేందుకు అవసరమైన సదుపాయాలతో భవనం ఏర్పాటు చేశారు. భరోసా కేంద్రం ఏర్పాటులో పోక్సో కేసుల బాధితులు, విచారణ తదితర అంశాలకు సంబంధించిన కేసులను పరిశీలిస్తారు. ఈ కేంద్రం వల్ల ఆయా కేసుల్లో మరింత గోప్యతకు అవకాశం ఏర్పడనుంది.
జిల్లా పోలీస్ కార్యాలయం, భరోసా కేంద్రాన్ని సోమవారం ఉదయం 11.20 గంటలకు ప్రారంభిచనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి డీజీపీ బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ మల్టీజోన్–2 డీఎస్ చౌహాన్, అదనపు డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ ఎం భగవత్ హాజరు కానున్నారు. ప్రారంభం అనంతరం పోలీస్‌స్టాప్, మీడియాతో ఇంటరాక్ట్ నున్నారు.
ఫ నేడు భువనగిరిలో పోలీస్ కార్యాలయం, భరోసా సెంటర్ ప్రారంభం
ఫ హాజరు కానున్న డీజీపీ శివధర్‌రెడ్డి


