భువనగిరిటౌన్ : భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో మహిళా పొదుపు సంఘాల సభ్యులకు తెలియకుండా వారి పేరుతో రుణాలు డ్రా చేసి స్వాహాచేసిన మున్సిపల్ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు చెందిన ముగ్గురు రిసోర్స్ పర్సన్లను (ఆర్పీ) భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను శనివారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, కోర్టు వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
విచారణకు దారితీసిన ఫిర్యాదు
గతనెల (మార్చి) 23వ తేదీన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావును మహిళా సంఘాల సభ్యులు స్వయంగా కలిసి స్వయం సహాయక సంఘాల రుణాల విషయంలో అక్రమాలు జరిగినట్టుగా ఆధారాలతో సహ ఫిర్యాదు అందజేశారు. సభ్యుల ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన అదనపు కలెక్టర్, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఒకవైపు పోలీసులు, మరోవైపు అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేపట్టడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
కుంభకోణం జరిగిందిలా..
పోలీసుల దర్యాప్తులో 3వ వార్డు ఆర్పీ ఉడుగుల దివ్య, 7వ వార్డు ఆర్పీ కొండరి సిరియాల, 18వ వార్డు ఆర్పీ చొప్పరి బిందు కలిసి 2022 నుంచి 2026 మధ్యకాలంలో వివిధ సంఘాల పేరుతో సుమారు రూ.40 లక్షల వరకు నిధులను స్వాహా చేసినట్లు తేలింది. మహిళా సంఘాల సభ్యుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, వారి సంతకాలు, పత్రాలను దుర్వినియోగం చేస్తూ ఈ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.
అధికారుల ప్రమేయంపై ఆరా..
ఈ భారీ మోసంలో కేవలం ఆర్పీలే కాకుండా, కొందరు బ్యాంకు అధికారులు, మున్సిపల్ మెప్మా అధికారుల సహకారం కూడా ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించాయి. గత నెల 31న పట్టణ పోలీస్ స్టేషన్‌లో విచారణ చేపట్టారు. వివరాలు పూర్తి స్థాయిలో గుర్తించారు. మేరకు ఈ కోణంలో కూడా మరింత విచారణ జరుపుతున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
రిమాండ్‌కు తరలింపు
నిందితులకు కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని నిజాలు రాబట్టేందుకు నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విచారణతో నిజాలు నిగ్గుతేలుతాయి.
ఫ రూ.40 లక్షలు కాజేసిన నిందితులు
ఫ పధ్నాలుగు రోజుల రిమాండ్
ఫ అదనపు కలెక్టర్ ఆదేశాలతో
వేగవంతమైన విచారణ
ఫ నిజాలు తేల్చేందుకు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో ఫిటిషన్ దాఖలు


