చిలుకూరు : బి–ఫార్మసీ విద్యార్థిని కళాశాల హాస్టల్ నుంచి అదృశ్యమైంది. విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాలోని బోనకల్‌కు చెందిన ప్రసన్న చిలుకూరు మండల పరిధిలోని మిట్స్ కళాశాలలో బి–ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటుంది. ఆదివారం ఉదయం ప్రసన్న హాస్టల్‌లో కనిపించకపోవడంతో కళాశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రసన్న తల్లిదండ్రులు మధ్యాహ్నం కళాశాలకు వచ్చి ఆరా తీసినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె కనిపించకుండాపోయిందని ప్రసన్న తల్లిదండ్రులు చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పిడుగుపాటుతో గేదె మృతి
తుర్కపల్లి : మండలంలోని పల్లెపహడ్ గ్రామంలో ఆదివారం పిడుగుపాటుతో గేదె మృతిచెందింది. వివరాలు.. పల్లెపహాడ్ గ్రామానికి చెందిన రైతు జాగిల్లపురం హరికృష్ణ తన వ్యవసాయ బావి వద్ద గేదెను కట్టేశాడు. ఆదివారం ఉదయం వర్షం కురవగా.. గేదె సమీపంలో పిడుగు పడటంతో మృతిచెందింది. గేదె విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరుతున్నాడు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
మోత్కూరు : మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన దయ్యాల వెంకన్న తన భార్య కళమ్మ, కుమారుడు ఉపేంద్రతో కలిసి బైక్‌పై స్వగ్రామం నుంచి అమ్మనబోలు వైపు వెళ్తుండగా.. అనాజిపురం గ్రామ చౌరస్తా వద్దకు రాగానే తిరుమలగిరి వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకన్న, అతడి భార్య, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు అంబులెన్స్‌లో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన దించనాల కమలాచారికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె. సతీష్ తెలిపారు.
గుండెపోటుతో రైతు మృతి
నిడమనూరు : మండల కేంద్రానికి చెందిన రైతు ఉన్నం శ్రీనివాసరావు అలియాస్ శ్రీను(45) ఆదివారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్ద గుండెపోటుతో మృతిచెందాడు. శ్రీను తన వ్యవసాయ భూమిలోనే ఇల్లు నిర్మించుకుని అక్కడే డెయిరీ ఫాం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం వరి పొలం కోసిన ఆయన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్రించాడు. నిద్రలోనే అతడికి గుండెపోటు రావడంతో మృతిచెందాడు. సాయంత్రం అయినప్పటికీ శ్రీను నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల రైతులు గమనించి వెంటనే 108 సిబ్బందికి ఫోన్ చేశారు. 108 వాహన ఈఎంటీ ప్రతాప్ వచ్చి శ్రీనును పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు.


