తీగ జాతి పంటల సాగు లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

తీగ జాతి పంటల సాగు లాభదాయకం

Apr 6 2026 7:12 AM | Updated on Apr 6 2026 7:12 AM

హాలియా : వేసవిలో తీగజాతి పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని అనుముల ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి చెబుతున్నారు. ఎండల తాకిడికి ఇతర కూరగాయల సాగు తగ్గి ధరలు పెరుగుతాయని, ఇలాంటి సమయంలో తీగజాతి కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చిన ఆయన పేర్కొన్నారు.

ఏయే పంటలు వేయాలంటే..

వేసవిలో తీగజాతి పంటలైన దోసకాయ, బీరకాయ, సోరకాయ, దొండకాయ, గోరుచిక్కుడు, ఆకుకూరలు పంటలు బాగా పండుతాయి. ఇవి ఉష్ణోగ్రతలను తట్టుకుని అధిక దిగుబడులను అందిస్తాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ రెండోవారం లోగా వీటిని సాగుచేయాలి. వీటికి తక్కువ నీటి అవసరం ఉంటుంది. దొండను ఒక్కసారి సాగు చేస్తే ఆరేళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. రైతులు ముందస్తు ప్రణాళికతో వేసవిలో పంట దిగుబడి వచ్చేలా కూరగాయ పంటలు సాగు చేసుకోవాలి. కాకరలో ఔషధ గుణాలు ఉండటంతో కాలంతో పనిలేకుండా అన్ని సమయాల్లో ధర ఉంటుంది. కాకరలో పూసా, దో, మౌసమి, యూఎస్‌ 6214, కోబ్రా హైబ్రిడ్‌ రకాలు వేసవి సాగుకు అనుకూలం. ఎంత వేడిమినైనా తట్టుకుని పెరిగే పంటల్లో సొరకాయ ఒకటి. పూసా, నవీన్‌, ఆర్క బిహార్‌ అంకుల్‌ హెచ్‌, సింజె వంటి రకాలు వేసవిలో అనుకూలంగా ఉండి అరవై రోజుల వరకు దిగుబడులు ఉంటాయి. వేసవిలో సొరకాయలకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వేసవిలో బీర దిగుబడి కూడా ప్రథమ స్థానంలో ఉంటుంది. పందిరి సాగు ద్వారా నాటిన 55 రోజుల్లో దిగుబడి ప్రారంభమవుతుంది. రెండు నెలల వరకు నిరంతరం దిగుబడి వస్తాయి. అరక సుజాత్‌, పూసా, నస్తార్‌, నాగ హైబ్రిడ్‌, యూఎస్‌ 7109 రకాలు సాగుకు అనుకూలం.

తోటకూర, మెంతికూర ఉత్తమం

అధిక పోషక విలువలు గల ఆకుకూరలకు వేసవిలో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. కానీ చాలా రకాలు ఎండకు తట్టుకోలేవు. మే నెలలో వడగాల్పులకు పాలకూర, కొత్తిమీర, చుక్కకూర త్వరగా దెబ్బతింటాయి. తోట కూర, మెంతికూరకు ఎండలను తట్టుకునే శక్తి ఉంటుంది. తోటకూరలో అర్క, అరుమణి రకాలు వేసవిలో సాగు చేసేందుకు మంచివి వేసిన నెల రోజుల్లో పంట చేతికి వస్తుంది. రెండు మాసాల పాటు దిగుబడి వస్తుంది. మెంతికూరలో పూసా, ఎర్లీ, బంచింగ్‌ రకాలు ఉత్తమమైనవి. ఇది కూడా రెండు నెలల పాటు దిగుబడి వస్తుంది.

డ్రిప్‌, మల్చింగ్‌ ముఖ్యం

తీగజాతి కూరగాయల సాగుకు పాటు డ్రిప్‌, మల్చింగ్‌ చాలా ముఖ్యం. వేసవిలో నీటి లభ్యత తక్కువగా ఉంటున్నందున కొద్దిపాటి నీటితో అధిక దిగుబడి అందించే తీగజాతి కూరగాయ పంటలు సాగు చేసుకోవాలి. రైతులు మందస్తు ప్రణాళికతో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో పండించిన పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది.

అనుముల ప్రాంతీయ ఉద్యానవన

అధికారి మురళి సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement