పూత, పిందె నిలిస్తేనే బత్తాయి దిగుబడి
● సూక్ష్మధాతువుల లోపాల నివారణకు జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, మెగ్నిషియం సల్ఫేట్ 2 గ్రాములు, పెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు, మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, బోరాక్స్ 1 గ్రాము, సున్నం 6 గ్రాములు, యూరియా 10 గ్రాములను ఒక లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. మార్కెట్‌లో లభిస్తున్న బ్రాండెడ్ కంపెనీల ఫార్ములా–4, ద్రవ రూపంలోని ఫార్ములా–6 మందుల పిచికారీతో సూక్ష్మఽధాతు లోపాలను నివారించుకోవచ్చు.
గుర్రంపోడు : బత్తాయి తోటలు ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్నాయి. వాతావరణ పరిస్థితులను బట్టి ఈసారి ఆలస్యంగా పూత, పిందె రావడం వల్ల మరికొద్ది రోజుల్లో ఎండల వల్ల అవి రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె రాలడం సహజమైనప్పటికీ మరీ ఎక్కువగా రాలిపోవడాన్ని నివారించేందుకు అధిక దిగుబడులు సాధ్యమని ప్రాంతీయ ఉద్యానవవ శాఖ అధికారి కె.మురళి అంటున్నారు. ఈ నేపథ్యంలో బత్తాయి తోటల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్నారు. రైతులకు ఆయన అందిస్తున్న సూచనలు ఇవీ..
● బత్తాయి తోటలు పూత, పిందెలతో ఉన్నప్పుడు వేర్లు ఉన్న ప్రాంతాన్ని కదిలించరాదు. పాదులు తవ్వడం, దున్నడం ద్వారా వేర్లకు నష్టం కలిగించరాదు.
● పూత, పిందె దశల్లో క్రమపద్ధతిలో నీటి తడులివ్వాలి. బిందుసేద్యం ద్వారా ప్రస్తుత నెలలో కాపునిచ్చే తోటలకు రోజూ గంటసేపు నీరు అందించాలి. కాపునిచ్చే చెట్టుకు కనీసం ఆరు డ్రిప్పర్లు అమర్చుకోవాలి. నీటి తడులు అందించడం ఎక్కువైనా, తక్కువైనా పూత, పిందె రాలుతుంది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో అధిక వేడి వల్ల పూత, పిందె రాలే అవకాశం ఉన్నందున నీటి ఎద్దడి ఏర్పడకుండా చూసుకోవాలి.
● పూత, పిందె రాలుట అరికట్టడానికి 2–4డి హార్మోన్ మందు 10 పీపీఎం అంటే ఒక గ్రాము మందును 100 లీటర్ల నీటిలో లేదా ప్లానోఫిక్స్ హార్మోన్ మందు మిల్లీలీటర్‌ను 5 లీటర్ల నీటిలో కలిపి పూత సమయంలో ఒకమారు, పిందె గోలికాయ సైజు ఉన్నప్పుడు ఇంకోసారి పిచికారీ చేయాలి. ఐతే హార్మోనులను నిర్ణీత మోతాదులోనే పిచికారీ చేయాలి. మోతాదు మించితే పూత, పిందె రాలిపోవడమేగాక చెట్టు కూడా దెబ్బతింటుంది.
● ఆకులు చుట్టుకుని ఉండే పురుగుల వల్ల పూత, పిందె రాలుతుంది. వీటి నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ మందు 0.5 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
● తొడిమకుళ్లు తెగులు వల్ల బఠాణీ గింజ సైజు నుంచి నిమ్మకాయ కాయలు ఎక్కువగా రాలిపోతుంటాయి. కాయపై తొడిమ దగ్గర పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే కార్బండిజమ్, మాంకోజెబ్ కలిపి ఉన్న మందులను ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున కలిపి లేదా ఒక గ్రాము రెడోమిల్ ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి నెల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
● బత్తాయి పిందెలను రేగికాయ నుంచి గోలికాయ దశలోకి మారేవరకు రసం పీల్చే పురుగులు ఆశించి కాయలపై లేత పసుపు మచ్చలు ఏర్పడేలా చేస్తాయి. సొళ్లుగా వాడుక భాషలో వాడే ఈ రకమైన వాటి వల్ల లేత దశలో కనిపించకుండా కాయలు పెరిగిన తర్వాత ఒక రకమైన చారికలు ఏర్పడతాయి. లేత దశలో గుర్తించకుంటే ఆ తర్వాత ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండదు. వీటి నివారణకు థయోమాక్సిన్ అర గ్రామును లీటర్ నీటికి లేదా ఇమిడా క్లోప్రిడ్‌ను అర మిల్లీలీటర్‌ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
● సూక్ష్మధాతు లోపాలతో చెట్లు పల్లగా పసుపు రంగులోకి మారి ఉంటే పూత, పిందె నిలబడదు. చలి తీవ్రత వల్ల సూక్ష్మధాతు లోపాలు బయటపడి ఇప్పటికే కొన్ని తోటలు పసుపు రంగులోకి మారి, చెట్టుపై ఆకులు తక్కువగా ఉండి చిన్నసైజు ఆకులతో రేగు చెట్ల ఆకుల మాదిరిగా ఉండటం జరుగుతుంది. సేంద్రియ ఎరువును యేటా తప్పనిసరిగా రసాయన ఎరువులతో కలిపి వాడటం, తోటల మధ్యలో పచ్చిరొట్ట పంటలు సాగుచేసి భూమిలో కలియదున్నడం చేయడం ద్వారా చాల వరకు సూక్ష్మధాతు లోపాలు రాకుండా నివారించుకోవచ్చు.
బత్తాయి తోటల్లో సరైన
యాజమాన్యమే కీలకం
రైతులకు ప్రాంతీయ ఉద్యానవన శాఖ అధికారి మురళి సూచనలు
పూత, పిందె నిలిస్తేనే బత్తాయి దిగుబడి


