ఇద్దరు దొంగల రిమాండ్
మునుగోడు: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరించిన ఇద్దరు దొంగలను మునుగోడు పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి స్థానిక ఎస్‌ఐ ఇరుగు రవితో కలిసి విలేకరులకు వెల్లడించారు. మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన కొరెపోలు వెంకటమ్మ ఈ నెల 15న గ్రామ శివారులోని తమ వ్యవసాయ భూమి వద్ద చింతపండు ఏరుకుంటుండగా.. అదే సమయంలో హైదరాబాద్‌లోని నాగోల్‌కు చెందిన మాద నరేందర్‌గౌడ్, వల్లెపు సాయికుమార్ కారులో అటుగా వెళ్తూ ఆమె మెడలోని బంగారు గొలుసుని గమనించారు. వెంటనే కారును ఆపి వెంకటమ్మ వద్దకు వెళ్లి చింతపండు ఎంతకు అమ్ముతావని మాటలు కలిపి ఆమె మెడలోని ఒక తులం ఏడు గ్రాముల బంగారు నల్లపూసల గొలుసు లాక్కోని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గురువారం మునుగోడు శివారులోని కార్తికేయ కాటన్ మిల్లు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నరేందర్‌గౌడ్, సాయికుమార్ కారులో వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వారిద్దరు గతంలోనూ ఇలాగే దొంగతాలు చేయడంతో పాటు సుపారీ తీసుకుని హత్యాయత్నాలు చేసినట్లు డీఎస్పీ వివరించారు. పలు కేసుల్లో నిందితులిద్దరు జైలుకు కూడా వెళ్లి వచ్చారని, మద్యం, ఇతర వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించేదుకు చోరీలు చేస్తున్నారని తెలిపారు.


