దివిటీల నుంచి దివ్య కాంతులకు..
ఫ 1950కి ముందు దివిటీల వెలుగుల్లోనే పూజలు
ఫ 1952లో జనరేటర్ ఏర్పాటుతో కరెంట్ వెలుగులు
యాదగిరిగుట్ట: ఓ వైపు ఆధ్యాత్మిక వైభవం.. మరోవైపు ఆహ్లాదపరిచే పరిసరాలు.. వీటికి తోడు కళ్లు జిగేల్‌మనిపించే విద్యుత్ దీపాలంకరణ.. ఇది యాదగిరీశుడి బ్రహ్మోత్సవాల్లో ఆకట్టుకుంటున్న దృశ్యాలు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజుల పాటు కొండంతా రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులు భక్తులను, స్థానికులను కనువిందు చేస్తాయి.
దశాబ్దాల క్రితం నుంచే..
1950కి ముందు విద్యుత్ సదుపాయం లేక దివిటీలు వెలిగించి యాదగిరీశుడి ఉత్సవాలు జరిపేవారని పూర్వీకులు చెబుతున్నారు. 1952లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఈ క్షేత్రాన్ని సందర్శించి జనరేటర్ మంజూరు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నృసింహస్వామి క్షేత్రాన్ని సందర్శించి గుట్టలో విద్యుద్దీకరణకు ఆదేశాలు జారీ చేశారని.. అప్పటి నుంచి కొండపైనే కాకుండా పట్టణ పరిధిలోనూ విద్యుద్దీకరణ పనులు జరిగాయి. విద్యుత్ సదుపాయం సమకూరడంతో నాటి ఈఓ బసవయ్య భాగ్యనగరానికి చెందిన విద్యుత్ దీపాలంకరణ కాంట్రాక్టర్లతో మాట్లాడి కొండపైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించినట్లు అప్పటి అర్చకులు, అధికారులు చెబుతున్నారు. రామ్‌దయాల్ కమిటీ అధ్యక్షుడిగా విద్యుద్దీకరణను మరింత పెంచినట్లు వారు పేర్కొన్నారు. ఆలయం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత దేవస్థానం అధికారులు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేపట్టారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ పునర్నిర్మాణం తర్వాత బంగారు కాంతులీనే విద్యుత్ దీపాలతో పాటు ఏర్పాటు చేసిన లైటింగ్ ఆలయ వైభవాన్ని మరింత పెంచాయి.


