మిరప కోతలో మెళకువలు | - | Sakshi
Sakshi News home page

మిరప కోతలో మెళకువలు

Dec 11 2025 10:09 AM | Updated on Dec 11 2025 10:09 AM

మిరప

మిరప కోతలో మెళకువలు

కోత విధానం ఇలా..

మిరపకాయలు కోతకు వచ్చిన వెంటనే కూలీలతో కోయిస్తే చెట్టు విరిగిపోయి పంటకు నష్టం కలుగుతుందని రైతులు భావిస్తున్నారు. చాలా కాయలు పండిన తర్వాత ఒకేసారి కోయవచ్చునని మరికొంత మంది రైతులు భావించి కోతను ఆలస్యం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే పండిన కాయలు రాలిపోతాయి. మంచు వల్ల కూడా కాయలు రాలిపోయే అవకాశం ఉంది. ఒక్కోసారి తెల్లకాయలు ఎక్కువగా వస్తుంటాయి. మొక్కల ఎదుగుదల తగ్గుతుంది. అందువల్ల రైతులు కోతకు వచ్చిన మిరపకాయల్ని విడతల వారీగా కోసి నాణ్యత గల కాయల్ని మార్కెట్‌కు పంపాలి. పండిన కాయల్ని వెంటనే కోస్తే తెల్లకాయలు ఎక్కువగా రావు. కాయ కోత తర్వాత ఎరువులు వేసి, నీటి తడి పెడితే అదనంగా మొక్కకు కాయ వచ్చి దిగుబడి పెరుగుతుంది. రైతులు కనీసం కాయలను ఆరు, ఏడు దఫాలుగా కోయాలి.

పెద్దవూర: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు మిరప పంటను విస్తారంగా సాగు చేస్తున్నారు. మిరప పంట ఇప్పుడిప్పుడే కోత దశకు వస్తుండడంతో రైతులు మిరపకాయలు కోసేందుకు సిద్ధమవుతున్నారు. మిరప కోత, ఆరబెట్టే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని పెద్దవూర మండల వ్యవసాయ అధికారి కె. సందీప్‌కుమార్‌ పేర్కొన్నారు. మిరప కోత సమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..

● గత నెలలో ఇరవై రోజుల పాటు కురిసిన వర్షాలకు చాలా మిరప చేలు జాలు పట్టి గడ్డిలో కలిసిపోయాయి. సరిగ్గా ఎదుగుదల లేక, చీడపీడలు, తెగుళ్లతో ఎక్కువ దిగుబడి వచ్చే పరిస్థితి లేదు.

● మిరప రైతులు ఎకరానికి 20 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నా.. నాణ్యత లేక నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

● సరైన సమయంలో కోతలు కోయక, కల్లాల్లో వర్షానికి, మంచుకు కాయలు తడిస్తే నాణ్యత తగ్గుతుంది.

● మార్కెట్లో ధరలు లేక ఎగుమతులకు పనికిరాక, వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడం వంటి కారణాలతో రైతులు నష్టపోతున్నారు.

● పంట మార్పిడి చేయకపోవడం, విచక్షణారహితంగా పురుగు మందులు పిచికారీ చేయడం, పండిన మిరపకాయలు ఎప్పటికప్పుడు తెంచకపోవడం వంటి కారణాలతో కాయ నాణ్యత లోపిస్తుంది.

ఆరబెట్టడం ఇలా..

కొన్నిసార్లు కోతల సమయంలో వర్షాలు కురిస్తే సకాలంలో కోతలు జరగక కోసిన వాటిని సరైన సమయంలో ఎండబెట్టక నాణ్యత లేని మిర్చిగా మారిపోతుంది. ఫలితంగా మార్కెట్లో సరైన ధర రాక నష్టపోవాల్సి వస్తుంది. మిరపకాయల్ని ఎండబెట్టే కల్లాల్ని గట్టి భూమి ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలి. దుమ్ము ఎక్కువగా లేని, కొద్దిగా ఏటవాలు ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. నీళ్లు వెళ్లే వైపు కల్లం పొడవుగా ఉండాలి. వర్షం పడినప్పుడు పైనీళ్లు కల్లం పైకి రాకుండా కల్లం చుట్టూ అడుగున్నర ఎత్తు కట్ట ఏర్పాటు చేసుకోవాలి. తోట విస్తీర్ణం, దిగుబడిని బట్టి కల్లం పొడవు, వెడల్పులను తయారు చేసుకోవాలి. వర్షాలు పడ్డప్పుడు పరదాలు కప్పుతాం కాబట్టి నీరు తీసివేయడానికి అనుకూలంగా ఉంటుంది. దాదాపు 10 క్వింటాళ్ల మిరప 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు గల కల్లం తయారు చేసుకోవాలి. కల్లం సైజును బట్టి టార్ఫాలిన్‌ కవరు తెచ్చుకోవాలి. ప్రతిరోజు కోసే కాయల్ని కుప్పలుగా పోసి మరుసటి రోజు ఉదయం మంచు తగ్గగానే పలుచగా పోసి ఆరబెట్టాలి. ప్రతిరోజు సాయంత్రం ఆరబెట్టిన మిరపకాయల్ని కుప్పగా పోసి టార్ఫాలిన్‌ కవర్‌ కప్పి కాయలపై మంచు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేస్తే గాలి, వెలుతురు బాగా ప్రసరించి కాయలు త్వరగా ఎండుతాయి. కాయలు బాగా ఎండకముందే తెల్లకాయలు వేరుచేయాలి. కాయల్లో 5 శాతం తేమ ఉన్నప్పుడే వాటిని మండె పోసి గోనె సంచులతో కప్పాలి. మార్కెట్‌కు తీసుకెళ్లే రోజు ఉదయం శుభ్రమైన ఖాళీ సంచుల్లో వాటిని నింపాలి. ఒక్కో సంచిలో 40కిలోల కాయల కన్నా ఎక్కువ నింపకూడదు. ఎక్కువ కాయల్ని సంచిలో తొక్కితే కాయ నాణ్యత చెడిపోయి మార్కెట్‌లో సరైన ధర రాదు. కోత సమయంలో ఈ విధమైన చర్యలు చేపడితే నాణ్యమైన పంటతో పాటు మార్కెట్లో అధిక ధర పలుకుతుంది.

పెద్దవూర మండల వ్యవసాయాధికారి

సందీప్‌కుమార్‌ సూచనలు

మిరప కోతలో మెళకువలు1
1/1

మిరప కోతలో మెళకువలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement