స్వేచ్ఛగా ఓటు వేయండి
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి
485 మంది బైండోవర్
సాక్షి, యాదాద్రి : ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశాం.. అని డీసీపీ అక్షాంశ్‌యాదవ్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి ఆయన బుధవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
4 వేల మంది పోలీసులు
జిల్లాల్లోని 17 మండలాల్లో 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి, రెండో విడతలో 1,500 మంది, మూడో విడతలో 1,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో సివిల్ పోలీసులతో పాటు ఏఆర్, ఆర్మ్‌డు, ప్రత్యేక బలగాలు పాల్గొంటున్నాయి. ఐదుగురు ఏసీపీలు, 15మంది సీఐలు, 35మంది ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు ఉంటాయి. జనం గుమిగూడటం, పోలింగ్ కేంద్రంలోకి గుంపులుగా వెళ్లటం నేరం.
138 మొబైల్ పార్టీలు
మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న ఆరు మండలాల్లో 49 , రెండో విడత 51, మూడో విడత మండలాల్లో 138 రూట్ మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశాం. ప్రత్యేక పోలీసు బలగాలు, స్థానిక పోలీసు అధికారులు ఆయా మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలుగకుండా బందోబస్తుఉంటుంది.
219 సమస్యాత్మక గ్రామాలు
జిల్లా వ్యాప్తంగా 219 సమస్మాత్మక గ్రామాలను గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఎన్నికలు ముగిసే వరకు నిరంతర నిఘా ఉంటుంది. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు అక్కడ నిత్యం సంచరిస్తూ ఓటర్లకు భరోసా కల్పిస్తారు.
చెక్‌పోస్ట్‌ల వద్ద నిరంతర నిఘా..
బొమ్మలరామారం, ఆలేరు, పంతంగి, బీబీనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. ఆరు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఆరు స్ట్రైకింగ్ పోర్స్ టీంలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచాం. మద్యం, నగదు అక్రమ రవాణాతో పాటు గిఫ్ట్‌లు తరలించకుండా అడ్డుకునేందుకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం.
ఫ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
ఫ మూడు విడతల్లో 4వేల మంది పోలీసులతో బందోబస్తు
ఫ సమస్యాత్మక గ్రామాల్లో సాయుధ బలగాల మొహరింపు
‘సాక్షి’తో డీసీపీ అక్షాంశ్‌యాదవ్
ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం బాణాసంచాలు కాల్చడం నిషేథం. ర్యాలీలు, ఊరేగింపులకు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
గత ఎన్నికల్లో గొడవలకు దిగిన, నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించాం. వారిలో 485 మందిని బైండోవర్ చేశాం. ఎన్నికల నిబంధనలు అతిక్రమించి లిక్కర్ కలిగిన 142 మంది పైన కేసులు నమోదు చేశాం. 1000 లీటర్ల అక్రమ మద్యాన్ని సీజ్ చేశాం. 19 మంది నుంచి గన్‌లు డిపాజిట్ చేసుకున్నాం. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అలజడి సృష్టించినా వెంటనే చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దు. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా తమకు నచ్చిన వారికి ఓటు వేయాలి. ఓటర్లను ఎవరైనా అడ్డుకున్నా, ప్రలోభ పెట్టిన కేసులు నమోదు చేస్తాం. అలజడులు సృష్టించి యువత కేసుల పాలు కావద్దు.


