ఓటుకు రూ.5వేలు, మద్యం!
సర్పంచ్ పీటం కోసం అభ్యర్థులు రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. యాదగిరిగుట్ట, రాజాపేట, ఆత్మకూర్(ఎం) మండలాల్లోని మేజర్ గ్రామ పంచాయతీల్లో ఒక్కో ఓటరుకు రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ఫుట్‌బాల్ గుర్తు వచ్చిన అభ్యర్థి గురిగింజసైజ్‌లో బంగారు పూతతో తయారు చేయించిన బాల్స్‌ను పంపిణీ చేశాడని, ఒక్కో బాల్ విలువ రూ.1500 వరకు ఉంటుందని తెలిసింది. రాజాపేట మండలంలోని రెండు పంచాయతీల్లో మహిళా ఓటర్లందరికీ చీరలు, వెండి కుంకుమ బరిణెలు, చికెన్, బిర్యాని, మందుతో పాటు రూ. వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేశారని సమాచారం.
సాక్షి, యాదాద్రి : పల్లెపోరులో నోట్ల వర్షం కురుస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటుకు ఇంత అని రేటు కట్టి పంపిణీ చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే మొదలైన ప్రలోభపర్వం.. గురువారం అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యంతో పాటు చీరలు పంపిణీ కొనసాగించినట్లు తెలుస్తోంది. తాయిలాలకు ప్రభావితమయ్యే వర్గాలకు, తమకే ఓటు వేస్తారని భావించిన ఓటర్లకు ముట్టజెప్పారు. సర్పంచ్ అభ్యర్థులతో పాటు ఉప సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్న అభ్యర్థులు సైతం ఖర్చుకు ఏమాత్రం వెనుకాడ లేదు.
గుర్తులతో కూడిన వస్తువులు పంపిణీ
విచ్చల విడిగా మద్యం, డబ్బుతో పాటు పలు రకాల గిఫ్ట్‌లను కూడా పంపిణీ చేశారు. అభ్యర్థులకు కేటాయించిన ఉంగరం, బ్యాట్, కత్తెర, స్టూల్, ఫుట్‌బాల్ గుర్తులను పోలిన వస్తువులను పంపిణీ చేసి ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద పంపిణీకి ప్లాన్
అభ్యర్థులు ఆఖరి అస్త్రంగా పోలింగ్ కేంద్రాల వద్ద సైతం ఓటర్లకు నగదు పంపిణీకి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
పంచాయతీ ఎన్నికల్లో నోట్ల వర్షం
ఫ ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా తాయిలాలిస్తున్న అభ్యర్థులు
ఫ మద్యం, నగదుతో పాటు కానుకలు
ఫ మేజర్ గ్రామ పంచాయతీల్లో లెక్కకు మించి వ్యయం


