పోలింగ్ రోజు సెలవు
భువనగిరిటౌన్ : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే మండలాల్లో ఆ రోజు సెలవులు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11,14,17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయని, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయలు, ఇతర సంస్థలు పోలింగ్ రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సెలవు ఇవ్వడం సాధ్యంకాని పక్షంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు టైమ్ ఆఫ్ కల్పించాలని పేర్కొన్నారు. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మూడో విడత ఎన్నికలు ముగిసే వరకు ఆంక్షలు
భువనగిరిటౌన్ : ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మూడో విడత ఎన్నికలు ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిఘా, తనిఖీ బందాలు, వ్యవయ పరిశీలకులు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈనెల 14న రెండో విడత ఎన్నికలు జరిగే మండలాల్లో 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగుస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో మద్యం షాపులు, కల్లు దుకాణాలు మూసివేయాలన్నారు.
‘ఓటు చోరీ’పై సంతకాల సేకరణ
మోత్కూరు: బీజేపీ ఓటరు జాబితా గోల్‌మాల్‌కు వ్యతిరేకంగా బుధవారం మోత్కూరులోని అంబేద్కర్ చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మోదీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. బీజేపీ ఓటు చోరుకు పాల్పడుతూ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని, దీనిపై గడపగడపకూ ప్రచారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగోని రామచంద్రుగౌడ్, జిల్లా నాయకులు కంచర్ల యాదగిరిరెడ్డి, గుర్రం లక్ష్మినర్సింహారెడ్డి, అవిశెట్టి అవిలుమల్లు, గడ్డం నర్సింహ, మండల నాయకులు బయ్యని రాజు, మందుల సురేష్, పల్లపు సమ్మయ్య, పోలినేని స్వామిరాయుడు, పురుగుల నర్సింహ, శేఖరాచారి, మున్నీర్, కోమటి మచ్చగిరి, మెంట భిక్షం, బందెల రవి పాల్గొన్నారు.
డీఎఫ్‌ఓగా సుధాకర్‌రెడ్డి
భువనగిరి : జిల్లా అటవీశాఖ అధికారి(డీఎఫ్‌ఓ)గా సుధాకర్‌రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అటవీ శాఖ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంట్లో భాగంగా రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌ఓగా ఉన్న సుధాకర్‌రెడ్డి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం డీఎఫ్‌ఓగా ఉన్న పద్మజారాణి సిద్ధిపేట జిల్లాకు బదిలీ అయ్యారు.
కొనుగోలు కేంద్రాల్లో తనిఖీలు
రామన్నపేట: మండలంలోని నీర్నెముల, మునిపంపుల, దుబ్బాక గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బుధవారం తూనికలు కొలతలు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నీర్నెముల గ్రామంలో తూనికల కొలతలశాఖ సర్టిఫై చేయని వేయింగ్ మిషన్ వాడుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. రికార్డు ల నిర్వహణ సక్రమంగా లేనట్లు గుర్తించారు. దుబ్బాక, మునిపంపులసెంటర్ల నిర్వాహకులు అందుబాటులో లేకపోవడంతో రికార్డులను పరిశీలించలేకపోయారు. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని, అక్రమాలకు పా ల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. వే బ్రిడ్జి తూకాల్లో వ్యత్యాసం లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. తనిఖీల్లో జిల్లా తూనికల కొలతల అధికారి వెంకటేశ్వర్లు, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఎస్‌కే గౌస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


